అమ్మలగన్న జగన్మాత ‘అమ్మ’ (పార్ట్ – 2)

44
Amma Jaganmatha

కాళీ

వైష్ణవశక్తి అయిన మహామాయే మహాకాళి. సర్వభూత లయకారకుడైన మహాకాలుని లయమోనర్చుకున్న శక్తి కాళి. కాలాన్ని లయిమ్పజేయునది కాళి. సృష్టికి పూర్వమున్న అంధకారరూపమే కాలీస్వరూపం. నిష్క్రయాతకంగా బ్రహ్మమందు నిక్లిప్తమైన శక్తే కాళి.

ఋగ్వేదంలో కాళి ఆవిర్భావం చెప్పబడింది. దేవమాత అదితికి ఆదిత్యులు జన్మించారు. అందుచే సూర్యోదయాస్తమయాలు రెండూ అదితికి అన్వయింప బడ్డాయి. కాని, అదితి ఉదయత్వాన్ని తాను ఉంచుకొని, అస్తమయాత్వాన్ని దితికి అన్వయించింది. ఈ ఇద్దరు దేవతలు చీకటివెలుగులు, సృష్టిలయాలు, జనన మరణాలు, జ్ఞానాజ్ఞానాలు – వీటికి అధిదేవతలనారు. ఈ ఇద్దరితత్వాలు ఏకమై ‘కాళీమాత’ అనే సంయుక్త రూపం ఏర్పడిందని ప్రశస్తి.

కాళీ స్వరూపం బాహ్యానికి భయంకరం. సదాశివుని శావాసనంగా, ఆయన గుండెల మీద ఒక కాలును ఉంచి, కాళిక దిగంబరంగా నిలబడి ఉంటుంది. నల్లని రంగు, మెడలో 54 కపాలలతో కూర్చిన దండ, ఒక చేతిలో రక్తసిక్తమైన శిరస్సు రెండో చేతిలో కత్తి. ఇంకొక కుడి చేయి అభయముద్రలో ఉంది, ఎడమ చేయి అభయ ప్రదానం చేస్తున్నట్లుంటుంది. నుదుట మూడవకన్ను ప్రజ్వలిస్తుంటే, రక్తసిక్తమైన నాలుక వేలాడుతుంటుంది. ఆమె దిగంబరి. కాని, దిక్కులనే వస్త్రాలుగా ధరించిన దేవత. తెల్లనిఛాయ శివుడు శుద్ధచిద్రూపుడై, శవాకృతిగా ఉండగా, క్రియారూపిణి అయిన కాళికాశక్తి శివునిపై ఆధారపడి ఉంది. సౌమ్య, రౌద్ర రూపాల సమన్వయాకరమే కాళీస్వరూపం. తాత్విక దృష్టితో కాళీ స్వరూపాన్ని పరిశీలిస్తే, ఆమె తత్వమయి. సృష్టికి అవసరమైన ఇచ్ఛాశక్తి. ఆమె ధరించిన కపాలాలు 54 సంస్కృత అక్షరాల సంపుటి. ఆ కపాలాలు ఆయా అక్షరాలను ఉచ్ఛరిస్తే. , ఆ శబ్దాలు ఏకస్వరమై అ, ఉ, మ స్వరూపమై ‘ఓం’కార మైనది. చండముండులను వధించి చాముండేశ్వరిగా ప్రసిద్ధి చెందింది.

దుర్గ

కాలీమాతతోబాటు పూజలందుకునే తల్లి దుర్గ. దుర్గముడనే రాక్షసుని చంపినా దుర్గ సర్వాలంకారశోభిత. సింహవాహిని, మహిషాసురుని సంహరించినది. 20 చేతులలో వివిధమైన ఆయుధాలను పట్టుకొని ఉంటుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణకై అనేక రూపాలు, నామాలు ధరించింది. శుంభ నిశుంభులను సంహరించటానికి విధ్యావాసిని అయి రాక్షససంహారం చేసింది. 100 ఏళ్లు వానలు లేక బాధలు పడుతున్న మునులు ప్రార్ధించగా ‘శతాక్షి’గా వారి బాధలను తీర్చింది. తన శరీరం నుండి క్షాకాలను పుట్టించి జనుల ఆర్తి తీర్చి ‘శాకంబరీ దేవి’గా ప్రసిద్ధి చెందింది. ఈ తల్లినే దేవదేవి, బ్రహ్మచారిణి, మహిషాసురమర్దిని, శివా, భగవతి మొదలైన అనేక నామాలతో కొలుస్తారు. ఈమె వాసుదేవుని సోదరి. సప్తశతిలో దుర్గకు 9 పేర్లు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చండీఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మాహాగౌరి, సిద్ధి. వీరు నవదుర్గలుగా పూజలందుకుంటున్నారు.

శ్రీరామచంద్రుడు రావణుని వధించే శక్తిని పొందటానికి దుర్గాని పూజించాడట. శ్రీకృష్ణపరమాత్మ గోలోకంలో దుర్గను ఆరాధించాడట. త్రిపురసంహారానికి ముందు పరమశివుడు దుర్గను తలచుకొన్నాడట. మధుకైటభులచే బాధించబడిన బ్రహ్మ, దుర్గను వేడుకోన్నాడట. దుర్గాసుని శాపానికి గురైన ఇంద్రుడు, దుర్గను శరణన్నాడట. ఈమె పాతాళంలో వైష్ణవి, యమలోకంలో కాలరూపిణి, కుబేరలోకంలో సౌందర్యవతి, ఆగ్నేయ ద్వీపాలలో మహానంద, ఈశాన్యదేశాలలో మృగవాహిని, ఉత్తర దేశములో శూలధారిణి, నైఋతి దిశలో రక్తదంతి, దక్షిణాన రామేశ్వరి, సింహళంలో దేవమోహినిగా వాసికెక్కి ఆరాధింపబడుతోంది. దేశ సాంప్రదాయాలననుసారించి దుర్గ రూపంలో మార్పులు, చేర్పులు చేయబడ్డాయి. ఏ పేరైనా, ఏ రూపమైనా, దుర్గ సర్వేసర్వత్రా ఆరాధ్యదేవత. దుర్గారాధన దేవీ ఉపాసకులకు అత్యంత ముఖ్యం.

పార్వతి

పర్వతరాజు కుమార్తెగా జన్మించిన సతీదేవియే పార్వతి. అచంచలమైన పర్వతశక్తి పార్వతి. కొన్ని ఉపనిషత్తులలో పార్వతి, ‘ఉమ’ అనే పేరుతో చెప్పబడింది. రుద్రాధ్యయంలోని నామం “సోమాయనమః” – వివరిస్తే స – ఉమ అని వ్యాఖ్యానించబడింది. ఉమతో కూడిన సోముడే పరమశివుడు. కొన్ని పురాణాలలో శివుని భర్తగా పొందదలచి, తపస్సు చేయాలని బయలుదేరిన పార్వతిని ఆమె తల్లిదండ్రులు వారించారట. ఉ+మా = తపం మానుము అని అర్ధం. కనుకనే పార్వతికి ‘ఉమ’ పేరొచ్చింది. ‘ఉమ’కి ఇంకొక అర్థం “ఉ=శివ, మా=లక్ష్మి” అంటే శక్తితో కూడిన శివత్వం అని అర్థం చెప్ప బడింది. ఉ=శివ, మ=పరిమితము – అంటే శివుని పరిమితమొనర్చు శక్తి గలదని కూడ అర్థం చెబుతారు. “ఉమా” అంటే గులాబీరంగుతో తేజోమయమైన శరీరం కలదని అన్వయింపబడింది. సర్వజీవరాశిలో తేజోరూపంలో ఉన్న శక్తి ‘ఉమా’. ఉ=శ్రేష్టమైన, మా=చిత్తస్థితి. అంటే, గొప్పదైన చిత్త స్థితిని కలుగచేయునది ‘ఉమ’. అ+ఉ+మ – ‘ఓం’, కాని, కొందరు తాత్వికులు ఉ+మ+అ=ఉమ, ప్రణవరూపమని వర్ణించారు. శివసూత్రాలలో ‘ఉమ’ పదానికి అర్థం, యోగుల ఇచ్ఛాశక్తిగా పేర్కొనబడింది. పర్వతరాజపుత్రి పార్వతి గౌరవర్ణం కలది, కనుక ‘గౌరి’గా ప్రఖ్యాతి పొందింది. శివా, పార్వతి, గౌరి, ఉమా – పేరేదైనా ఈ నామాలన్నీ శివపరాలే.

లలిత

శీలలితాదేవి గురించి చెప్పాలంటే సాహసమే. లలితా సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి ఈరోజుల్లో ఇంటింటా నిత్యపారాయణగా జరుపబడుతోంది. లలితా సహస్రనామావళికి వివరణ రాసిన భాస్కరరాయులు మొదటి శ్లోకంగా శ్రీలలితను ప్రార్థించాడు. సర్వధార శక్తి అయిన లలిత శ్రీమాతగా, శ్రీమహారాజ్ఞిగా కొనియాడబడింది. పద్మపురాణంలో విశ్వానికి అతీతమై క్రీడించు శక్తి కనుక లలిత అని వర్ణింపబడింది. రాక్షస సంహారానికి దేవతల ప్రార్థనను మన్నించి, చిదగ్నికుండం నుండి ఆవిర్భవించిన లోకమాత లలిత.
ల – సర్వవిద్యలకు లక్ష్యమైనది,
లి – రూపము లేనిది,
త – సంసారం నుండి తరింపజేయునది, శ్రీలలిత.

శోభ, విలాసం,మాధుర్యం, గాంభీర్యం, స్థైర్యం, జేజం,అర్థం ” లాలిత్యం, ఔదార్యం – ఈ 8 పదాల “లలిత” పదములలో నిక్షిప్తం. చెరకుగడ ధనస్సుగా, కుసుమాలను అస్త్ర, బాణాలుగా ధరించి, ఉత్తమగుణాలు కలిగి, గణాతీతమైనది శ్రీలలిత. పంచబ్రహ్మాసనాసీన అయిన లలితకు లక్ష్మీ, సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తూ సేవిస్తుంటారు.పంచ బ్రహ్మాసనాన్ని ఎన్నో విధాలుగా వర్ణిస్తారు. పంచ సంఖ్యతో కూడిన మంత్రాసనం, చిత్క ళాసనం, వర్నాసనం – 10 దిక్కులకు, 14 భువనాలకు, 7 లోకాలకు అధిపతిన లలిత శ్రీమహారాజ్ఞి. బ్రహ్మాండమే ఆమె మహా సామ్రాజ్యము. ఆ తల్లి రెప్పపాటులో కాలం పుట్టింది. విశ్వమంతా తానే అయి వృద్ధిక్షయాలు లేని పూర్ణస్వరూపం లలిత. అమ్మ చేతి గోళ్ళ నుండి దశావతారాలు ఆవిర్భావించాయట. బ్రహ్మ, విష్ణు, రుద్రుల కంటే సనాతనమైన లలితాదేవి, త్రిపుర సుందరగా కొలువబడుతోంది. సుషుప్తనాడులలోని శక్తి కనుక త్రిపురసుందరి. మనః, బుద్ధి, చిత్తాలలో వశించునది కనుక త్రిపురసుందరి.

విశ్వమంతా త్రితత్త్వాత్మికం. అందులో శక్తి కనుక త్రిపురసుందరి. మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మథుడు, అగస్త్యుడు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు, శివుడు దూర్వాసుడు – ఈ 12 మంది మహానీయుల పూజలందుకొంటున్న మహాపూజ్య. ఆ తల్లికి 64 కళలూ ఉపచారాలే. 64 కోట్ల యోగినీగణంచే సేవింపబడు నక్షత్ర మండలాలు, పాలపుంతలు, గ్రహకుండలాలు శ్రీలలితకు ఆభరణాలు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం – ఈ 5 ఇంద్రియ వ్యాపారాన్ని నడిపించే పంచతన్మాత్రలు. ఈ ఐదు తనన్మాత్రాలతో ఓ బాణాన్ని ధరించి ఉంటుంది ఆ తల్లి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here