అమ్మలగన్న ‘అమ్మ’ జగన్మాత (పార్ట్ – 1)

47
Amma Jaganmatha

జగన్మాత సకలశాస్త్ర స్వరూపిణి. ప్రాశాబద్ధుడై, స్వార్థ పరుడై, సత్యాన్ని విస్మరించిన మనిషికి, మనః, చిత్త, బుద్ధులను ప్రక్షాళన చేసి, తాను ఉన్నానని గుర్తు చేసి, మోక్షమార్గాన్ని సుగమం చేస్తోంది ఆ తల్లి. వ్యక్తమైన ఈ సృష్టికి పూర్వం, అగోచరమైన, అతీతమైన, ‘అమ్మ’, సృష్టి తరువాత, సకల చరాచరరూపంలో వ్యక్తమై, పోషణ భారాన్ని వహించింది. పరాశక్తి ప్రభావం చేతనే, అచేతనమైన సదాశివశక్తి సచేతనమై, గుణమై, సచ్చితానంద మూర్తియై, సృష్టిస్థితిలయలకు ఆధారమైంది. జగన్మాత శక్తిని వర్ణిస్తూ సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు, “తల్లీ! ఈశ్వరుడు జగన్నిర్మాణ శక్తితో చేరితేనే జగాలను నిర్మించేంతటి శక్తిగాలవాడవుతాడు. శివ, కేశవ, బ్రహ్మలచే పరిచర్యలు పొందదగు నిన్ను, పుణ్య లేశమైనా చేయని నావంటివాడు మొక్కుటకు, కీర్తించుటకు అర్హత కలదా” అని వర్ణించారు.

సప్తశతిలో దేవీసూక్తం, జగన్మాత శక్తిని అమోఘంగా వర్ణించింది. “యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా”. సర్వమానవ ప్రవృత్తులన్నీ అమ్మ స్వరూపాలేనని దేవి వర్ణించబడింది. మన భారతీయసంస్కృతి యొక్క మూలసూత్రం పారమార్థిక చింతన, పరమాత్మ మన ఇంద్రియాలను బహిర్ధ్రుష్టులతో కల్పించాడు. అందుకే మనిషి ఇంద్రియాలు ఎక్కువ భాగం బాహ్యవిషయాలకే ప్రాధాన్యత ఇస్తాయి. అది సహజం. వీటిలో బాటు అంతరింద్రియాలైన మనో, బుద్ధి, చిత్త, అహంకారాలను కూడా కల్పించాడు. మరి మన కర్తవ్యం ఏమిటి? విజ్ఞతతో, వివేకంతో, అంతరింద్రియాలను జాగృతం చేసి, ఆత్మాన్వేషణతో పరాశక్తి యొక్క ప్రజ్ఞని పరిపూర్ణంగా ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేయాలి. సాధించాలి.

దేవీగీతలో పరాశక్తి “తీర్థమున, కైలాస, వైకుంఠములలోకాక, నన్ను తెలుసుకొన్న జ్ఞాని హృదయకమల మధ్యమున నివశించెదను” అని తెలిపింది. అంతటి కృపామయి, ఆ తల్లి పాదాలను ఆశ్రయించటం మన కర్తవ్యం కాదా! అదే జేవన ధర్మం. “తల్లీ! నన్ను పాతాళానికి త్రోసినా, నిఖిల సామ్రాజాధిపత్యం ఇచ్చినా, నిశ్చయంగా నీ పాద పద్మాలను వదలను” అని శరణంటే తప్పక మన వెన్నుదన్నై నిలుస్తుంది ఆ తల్లి. వేదాలలో, ఉపనిషత్తులలో, దేవీశక్తి అద్భుతంగా వర్ణించబడింది. దేవ్యుపనిషత్తు శక్తి ఉపనిషత్తులలో ముఖమైనది. దేవీశక్తి ఉపనిషత్తులలో మరోముఖ్యమైనది త్రిపురతాపిన్యుపనిషత్తు. ఇందులో శక్తి ఉపాసనా విధులు. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రనిర్మాణం. అందలి రహస్యాలు, ఇంకా ఎన్నో విధి విధానాలు వివరించబడ్డాయి. పరమాద్భుతమైన శక్తి రూపాలలో ముఖ్యమైనవి కాళీ, దుర్గ, పార్వతి, లలితా, సరస్వతి. వీరు మన కోసం ఇక్కడ కొలువయి నిత్య పూజలందుకునే శక్తిరూపాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here