చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సీఎస్‌ రంగరాజన్‌ (story -2)

93
Chilkur Balaji Temple Priest C S Rangarajan Biography

అల్లకల్లోలమే….

నాకప్పుడు 35 ఏళ్లు. ‘మెడ్‌ట్రానిక్స్‌’ కంపెనీలో ఉన్నతాధికారి పదవి. ఒకట్రెండు సంవత్సరాల్లో దేశం మొత్తానికీ హెడ్‌ అయ్యే అవకాశాలూ ఉన్నాయి. అంత భవిష్యత్తున్న నేను ఇలా అర్చకవృత్తిలోకి రావాలనుకోవడం నాన్నకి అస్సలు ఇష్టంలేదు! కుటుంబంలో అల్లకల్లోలమే రేగింది. ఎవ్వరూ ఒప్పుకోలేదు. నేనూ నా నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు! రెండునెలల తర్వాత వాళ్లనెలాగోలా ఒప్పించాను. ఇక ఆఫీసులో అయితే నన్నెవరూ నమ్మలేకపోయారు. ‘ఇంతమంచి ఉద్యోగం వదులుకుని అర్చకత్వం చేస్తారా!’ అని నవ్వారు. ఎవరేమన్నా, అర్చకుడిగా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్లెం అందుకున్నాను!

కొత్తదారిలో..
అర్చకుడిగా మారిన తొలిరోజుల్లోనే నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీసేయించాను. వీఐపీ దర్శనాలూ, టికెట్లేవీ లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించాను. ఇప్పటికీ అదే తు.చ.తప్పకుండా పాటిస్తున్నాం. ఏ ఆదాయమూ లేదుకాబట్టి దేవాదాయ శాఖకి మా ఆలయం మీద ఆజమాయిషీ చలాయించే అవకాశం లేకుండా చేశాను. దేవాదాయ చట్టం 30/87 వల్ల తరతరాలుగా ఆలయాన్ని నమ్ముకున్న ఎన్నో అర్చక కుటుంబాలు ఎంతో నష్టపోయాయి.  అందుకే ఆ చట్టంపై అన్నిరకాలా పోరాడుతున్నాను. 1990లకి ముందు మా ఆలయానికి వారం మొత్తం మీద వెయ్యిమంది వస్తే గొప్ప! ఇప్పుడు వారాంతాల్లో నలభైవేలమందిదాకా వస్తున్నారు. వాళ్ల ద్వారా సామాజికంగా మార్పులు తీసుకువచ్చే పనులు చేపట్టాలనుకున్నా.

Chilkur Balaji Temple Priest C S Rangarajan Biography

ఇవన్నీ కూడా నేను నమ్మే సనాతన ధర్మమనే చట్రంలోనే ఉండాలనుకున్నాను. సనాతన ధర్మమంటే మూఢాచారమో, స్త్రీలపై వివక్షో, అంటరానితనాన్ని ప్రోత్సహించడమో కానేకాదు. అవన్నీ నడమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమే. వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికే ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవినీ ప్రేమించడమే. మన వేదవేదాంగాల సారం అదేనని నేను నమ్ముతా! అందుకే నా వంతుగా ఇక్కడున్న సమస్యలూ, రుగ్మతలూ తీరేందుకు ఏమైనా చేయాలనుకున్నా.

‘ఇదంతా నటన’

ఇక్కడి చేనేత కార్మికులు లాభపడేలా వారాంతాల్లో వచ్చే భక్తులందరూ చేనేత వస్త్రాలే ధరించి రావాలని కోరాను. అది మంచి ఫలితాన్నిచ్చింది. బాలికలపై అత్యాచారాలు జరగకుండా ఆ పసిపాపల్ని దేవతల్లాగే చూడాలని ‘కన్యావందనం’ అనే కార్యక్రమాన్ని చేపట్టాను. ప్రతి ఏటా ఫిబ్రవరిలో మేం ఇది చేస్తున్నాం! అమ్మాయిల గొప్పతనం చాటేలా ‘మహలక్ష్మీ’ పూజ అనీ చేస్తున్నాం. ఆరోజు పెళ్లికాని అమ్మాయిలకి కొత్తబట్టలుపెట్టి కాళ్లకి పారాణి రాస్తాం. వీటన్నింటి ద్వారా గుర్తింపుపెరిగి టీవీలో ఏ చర్చాకార్యక్రమాలు చేస్తున్నా నన్ను పిలవడం మొదలుపెట్టారు.

నా మాటలు టీవీల్లో ప్రసారం కాగానే ‘మీదంతా నటన. అసలు పూజారులందరూ దుర్మార్గులు. అవినీతిపరులు. మీవల్లే దళితులపైన వివక్ష’ అంటూ కుప్పలుతెప్పలుగా లేఖలు వచ్చేవి. ‘ఎవరో కొందరివల్ల మొత్తం హిందూ అర్చకులనే చెడ్డవారంటే ఎలా?’ ఈ మథనం నాలో చాలారోజులుగా ఉండేది.

అంత అంటరానితనమా?

గత ఏడాది అయ్యప్పస్వామి పడిపూజకని పిలిస్తే వెళ్లా. కార్యక్రమం తర్వాత నా దగ్గరకి ఓ వ్యక్తి బిడియంగా వచ్చి ‘స్వామీ! ఈ అయ్యప్ప పూజలోనూ కులాల వివక్ష తప్పట్లేదు. నేను దళితుణ్ణని నా వంటని వేరుగా వండుకోమని చెబుతున్నాడు మా గురుస్వామి!’ అన్నాడు. నేను కోపంతో వణికిపోయా. గురుస్వామిని పిలిచి చెడామడా తిట్టేశాను. అప్పుడే ఓ దళిత సంఘం నన్నో సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది. నేను దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ ‘మునివాహన సేవ’ గురించి చెప్పాను.

Chilkur Balaji Temple Priest C S Rangarajan Biography

అప్పుడో సభ్యుడు లేచి ‘మీరయితే ఓ దళితుణ్ని అలా భుజాలపై మోసుకెళ్తారా!’ అని సవాలు విసిరాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చేసి తీరతాననే చెప్పాను. అలా ఏప్రిల్‌ 17న ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అని పాడుకుంటూ ఆ హరిజన భక్తుణ్ణి మోసుకెళ్లాను. అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని ప్రసారం చేసింది. సోషల్‌ మీడియా ఆ దృశ్యంతో హోరెత్తింది.

దలైలామా మెచ్చారు….

నోబెల్‌ గ్రహీత దలైలామా కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిన రోజుని మరచిపోలేను! నేను మాట్లాడిన కొద్దిసేపటికే ఆయనో పెద్ద సందేశం పంపారు. ‘మీరు చేసిన పని ఆదర్శనీయం. సదా ఆచరణీయం. దేవుడి ముందు అందరూ సమానమేనని సోదాహరణంగా వివరించారు’ అంటూ సాగిందా లేఖ! ఇది నాకెంతో నమ్మకాన్నిచ్చింది. ఇది ఈ ఒక్క ఆలయ ప్రవేశంతో ఆగిపోదు. నగరాల్లోకంటే గ్రామాల్లోనే అంటరానితనం ఎక్కువ. కాబట్టి.. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ పల్లె నుంచి పట్టణం దాకా ఓ ఉద్యమంలా దీన్ని నిర్వహించబోతున్నాం.

Chilkur Balaji Temple Priest C S Rangarajan Biography

ఇది జరిగాక ప్రముఖ రచయిత కొలకలూరు ఇనాక్‌, కవి గోరటి వెంకన్న వంటివారు ఫోన్‌ చేసి అభినందనల్లో ముంచెత్తారు. ఆ మధ్య తిరుమలకి వెళ్లాను. నా గురించి అప్పటికే టీవీల్లో చూశారు కాబట్టి ఎంతోమంది జనం చుట్టుముట్టారు. అప్పుడో ముసలాయన తచ్చాడుతూ వచ్చి ‘మా జాతిని మోసిన భుజాలు ఇవే నా బాబూ..!’ అంటూ వచ్చి ముద్దుపెట్టుకున్నాడు. ఎందుకో తెలియదు ఆ దేవుడే వచ్చి నన్ను తాకాడా అనిపించింది ఆ రోజు! బొటబొటా కన్నీళ్లొచ్చేశాయ్‌!!

ఆ విలాసాలు వదులుకుంది…

“సుధని.. నేను ఇంటర్‌ చదివేటప్పుడు అహోబిల మఠంలో మొదటిసారి చూశాను. ఆమె అక్కడ ‘నృసింహప్రియ’ పత్రిక సంపాదకుడి బంధువులమ్మాయి. చూడగానే ప్రేమలో పడ్డానుకానీ మనసులో దాచుకున్నాను. ఆ పత్రికకి ‘ఫల్గుణ’ పేరుతో కథలూ, వ్యాసాలు రాయడం మొదలుపెట్టా. ఇంజినీరింగ్‌ ముగించాక ఇంట్లో విషయం చెప్పాను. వ్యతిరేకత లేదుకానీ.. పూర్తిగా అంగీకరించినట్టూ కాదు. ఎట్టకేలకు పెళ్ళైంది. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దాడికి ఏడేళ్లున్నప్పుడు అర్చకవృత్తిలోకి వెళ్లిపోతున్నానని చెప్పాను. ‘బాగా ఆలోచించే ఈ పని చేస్తున్నావా..!’ అని పదేపదే అడిగింది.

Chilkur Balaji Temple Priest C S Rangarajan Biography

అర్చకుడిగా నా ఆహార్యం, రోజూ దేవుడికిచ్చిన నైవేద్యం మాత్రమే తినడం.. నన్ను చూసి వచ్చే కన్నీళ్లని దాచుకునేందుకు విఫలయత్నం చేసేది. ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చాను. మా పెద్దోడు సీఏ చేస్తున్నాడు. చిన్నబ్బాయి ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. వీటన్నింటి వెనక నా భార్య ఇచ్చిన నైతిక మద్దతు అంతాఇంతా కాదు. లక్షల రూపాయల జీతం ఇచ్చే విలాసాలు వదులుకుని భర్తవెంట నడవాలంటే ఎంత కృతనిశ్చయం ఉండాలో కదా! తన అంగీకారంతోనే, ఆ మధ్య నా ఇద్దరి పిల్లల్లో ఒకర్ని బాలాజీ సేవకే అప్పగించాలనే నిర్ణయం కూడా తీసుకున్నా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here