చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సీఎస్‌ రంగరాజన్‌ (story -1)

51
Chilkur Balaji Temple Priest C S Rangarajan Biography

ఓ దళిత భక్తుణ్ణి భుజాలపైన ఎక్కించుకుని ఆలయ గర్భగుడిలోకి తీసుకెళ్లిన ‘మునివాహన సేవ’తో ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు సాధించారాయన నోబెల్‌ గ్రహీత దలైలామా ప్రశంసలూ అందుకున్నారు. ఆ సేవ వైపు తనని నడిపించిందేమిటో ఇలా చెబుతున్నారు….

“నా బాల్య జ్ఞాపకాలన్నింటా చిలుకూరు వేంకటేశ్వరస్వామి ఆలయ పరిసరాలే పచ్చగా పరుచుకుని ఉంటాయి.

తరతరాలుగా వస్తున్న అర్చకవృత్తిని చూస్తూనే నాన్న సౌందర్‌రాజన్‌ ఉన్నత చదువులు చదివారు. కామర్స్‌ లెక్చరర్‌గా మొదలుపెట్టి ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్‌ స్థాయికి ఎదిగారు. మా ఇంట్లో ముగ్గురం అబ్బాయిలమే. నేను నడిమివాణ్ణి. నేను చదువుకున్నదంతా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే. అక్కడి దేవుని ప్రార్థనా గీతాలు అలవోకగా పాడేవాణ్ణి. టీచర్లు నా చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవాళ్లు. బడికి పెద్దగా నామాలు పెట్టుకునేవెళ్లేవాణ్ణి. క్రైస్తవ బడులైనా సరే ఈ విషయంలో అక్కడెవరూ నన్ను ఆక్షేపించింది లేదు. ఆ పరమత సహనమే నా వ్యక్తిత్వాన్నితీర్చిదిద్దిందని చెప్పాలి.

Chilkur Balaji Temple Priest C S Rangarajan Carried Dalt Devotee Into Temple

చిన్నప్పటి నుంచీ వైద్యరంగంపైన ఆసక్తి ఉన్నా అప్పట్లో నాకు లెక్కల్లో మాత్రమే మంచి మార్కులొచ్చాయి. దాంతో ఇంజినీరింగ్‌ వైపే వెళ్లాల్సిన పరిస్థితి. అయినా వైద్యం మీద ఆశ చావక ఉస్మానియాలో ‘బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌’ తీసుకున్నా. చివరి ఏడాది థీసిస్‌ కోసం నేనూ నరేంద్రబాబూ అనే నా సహాధ్యాయీ కలిసి అతితక్కువ ఖర్చుతో తయారుచేయగల ‘సిరంజీ ఇన్‌ఫ్యూషన్‌ పంప్‌’ నమూనాని కనిపెట్టాం. డిగ్రీ పూర్తయ్యాక ఆ పరికరాన్నే భారీస్థాయిలో తయారుచేయాలనే కలతో నరేంద్రతో కలిసి ‘ఎన్‌ఆర్‌ బయోమెడికల్స్‌’ అనే కంపెనీ స్థాపించాను. నరేంద్రతో నాకు చిన్నగా మనస్పర్థలు వచ్చాయి. తగవులు పడి విడిపోవడం ఇష్టం లేక ‘కంపెనీని నువ్వే చూసుకో’ అని చెప్పి నేను బయటకొచ్చేశా. అప్పుడే వైద్య పరికరాలు తయారుచేసే ‘మెడ్‌ ట్రానిక్స్‌’ సంస్థ నాకు అధికారిగా ఉద్యోగం ఇచ్చింది.

Chilkur Balaji Temple Priest C S Rangarajan Biography

చెన్నైలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంత కాలం చిలుకూరికి దూరమవుతున్నాననే బాధ పీడిస్తూనే ఉండేది. ఆరేళ్లు గడిచాయి. ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పాను. దాంతో నాకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచారు. దక్షిణాది మొత్తానికి నన్ను హెడ్‌గా నియమించారు. 1999లోనే సంవత్సరానికి పదిలక్షల రూపాయల జీతం! ఇక జీవితానికి ఏ ఢోకా లేదు అనుకుంటుండగానే.. ఓ సంక్షోభం మమ్మల్ని కుదిపేసింది.

సర్కారు చట్టానికి నిరసనగా….

హైదరాబాద్‌ నగరానికి తాగునీళ్లిచ్చే ఉస్మాన్‌ సాగర్‌ చెరువులో ఉన్న ఓ చిన్న లంకే ఈ చిలుకూరు. ఇక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహం వెలసిన కొన్నేళ్ల తర్వాత అహోబిల మఠం స్వామీజీ అక్కడికి వచ్చారట. ఆగమాల ప్రకారం అనునిత్యం ఇక్కడ దేవుని సేవచేయడానికి తన శిష్యుణ్ణీ, అతని కుటుంబాన్నీ ఇక్కడే ఉండిపొమ్మన్నారట. ఆ శిష్యుడే మా పూర్వీకుడంటారు. తర్వాతికాలంలో ఔరంగజేబు ఆక్రమణకీ, రజాకార్ల దాడులకీ ఎదురొడ్డి ఈ ఆలయాన్ని కాపాడుకున్నాం.

Chilkur Balaji Temple Priest C S Rangarajan Biography

ఇప్పటికీ ఆ దేవుణ్ణి మా ఇంటి పెద్ద కొడుకుగానే మేమంతా భావిస్తాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1987లో 30/70 అనే దేవాదాయ చట్టంతో వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేస్తూ మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంది! నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీం కోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో దేవాదాయశాఖ దీన్ని సొంతం చేసుకోవాలనుకుంది. మా గుడిని యాదగిరిగుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది! అప్పుడు నాన్న మాకు వారసత్వ హక్కులు వస్తాయని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు.

అప్పుడే ఓ అధికారి..
‘సౌందర్‌రాజన్‌గారూ, మీ అబ్బాయిలు ముగ్గురూ ఇంజినీర్లు. వాళ్లు ఇక్కడికొచ్చి అర్చకత్వం ఎలాగూ చేయరు. ఇక దేనికండీ మీకీ ఆరాటం!’ అన్నారు. ఆ మాటలు నన్ను ఓ కొరడాలా తాకాయి. ఆ రోజే నిర్ణయించుకున్నా.. నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకెళ్లాలని!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here