ధర్మ సూక్ష్మం…

43
Dharma and Dharma Sukshma

“కాలానికి అనుగుణంగా సామాజిక ధర్మాలు మారుతుండటం సహజం. కొన్నాళ్ళకు ఈ ధర్మాలు అర్థరహితంగా అనిపించవచ్చు. కానీ, మన ప్రాచీన ధర్మాలలో కొన్ని నేటి సమాజ ధర్మానికి అతికినట్లుండటం విశేషం!”

స్త్రీలకి ఆస్తి హక్కు

మన పురాణాల ప్రసక్తి వచ్చినపుడు, అవన్నీ స్త్రీల హక్కులను కాలరాచాయనేది సాధారణంగా వినబడుతుండే విమర్శ. అయితే అది పూర్తి నిజం కాదన్న విషయం మన పురాణాలను, స్మృతులను చదివితే అర్ధమౌతుంది. ఉదాహరణకు మనుస్మృతిలో స్త్రీల ఆస్తి హక్కు గురించి ఇలా చెప్ప బడింది.

స్వేభ్యోంశేభ్యస్తు కన్యాభ్యః
ప్రదద్యుర్భ్రాతరః పృథక్
స్వాత్స్వాదంశాచ్చతుర్భాగం
పతితౌః స్యురదిత్సవః

అన్నదమ్ముల ఆస్తి పంపకాలను జరుపుకున్నప్పుడు ఒక్కొక్కరు తమ భాగాల్లోంచి నాలుగవ వంతుని తోబుట్టువులకు పంచి ఇవ్వాలి. మనం ఇప్పుడు స్త్రీ ఆస్తి హక్కులను గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ, ఆ రోజుల్లోనే మనువు స్త్రీ హక్కులను గురించి మాట్లాడాడు. అయితే మనుధర్మంలో కొన్ని కొన్ని విషయాలు నేటి కాలానికి పోల్చి విమర్శించే విమర్శకులు ఇటువంటి విషయాలను ప్రస్తావించరెందుకో! అలా ప్రస్తావించడానికి ఇష్టపడనప్పుడు ధర్మం కాలానికి కాలానికి మారుతుంటుందని ఒప్పుకున్నట్లే కదా! ఆందుకనే అప్పటి ధర్మాలలో చెడులను ఎలా విడిచిపెట్టుకుంటూ సమాజం ముందుకు సాగుతోందో, అదేవిధంగా మంచిని స్వీకరిస్తే బాగుంటుంది కదా!

అర్థనారీశ్వరం

మన సంప్రదాయంలో ఏదైనా శుభకార్యంలో స్త్రీలు, తమ భర్తకు ఎడమవైపున కూర్చోవాలని చెప్పబడింది. ఇటీవలి పరిశోధనలో కూడ పురుషుని ఎడమభాగం స్త్రీతత్త్వాన్ని, స్త్రీ కుడిభాగం స్త్రీ తత్త్వాన్ని కలిగి ఉంటుందని ధ్రువీకరించారు. ఈ విషయాన్నే మన పూర్వులు శక్తి సహితుడైన శివుడు ఆరాధ్యుడనీ, ‘శివశ్శక్త్యా యుక్తో యదిభవతి శక్తః’ అని చెప్పారు. బ్రహ్మ విద్యాశక్తి పార్వతిగా, బ్రహ్మం శివునిగా ద్యోతించిన తత్త్వాన్ని వైదిక సంప్రదాయం వర్ణిస్తే, ప్రకృతీ పురుషాత్మక జగత్ చైతన్యమే శివశక్తుల సామరస్యమని ఆగం చెబుతోంది. ఇది నేటి శాస్త్రవేత్తలను అబ్బురపరుస్తున్న అద్భుత విషయం. దీనిపై ప్రస్తుతం పరిశోధనలు జరుతుగుతున్నాయి.

సౌరశక్తి

ధ్యాయేత్ సూర్యమనంత శక్తి కిరణం
తేజోమయం భాస్కరం
భక్తానామభయప్రదం దినకరం
జ్యోతిర్మయం శంకరమ్
ఆదిత్యం జగదీశమచ్యుత మజం
త్రైలోక్య చూడామణిం
భక్తాభీష్టవరప్రదం దినమణిం
మార్తాండ మాద్యం శుభమ్

అనంత శక్తులుగల కిరణాలుగలవాడు సూర్యుడు. తేజోమయుడై వెలుగులను ఇచ్చే భాస్కరుడాయన. భక్తులకు అభయాన్నిస్తాడు. ‘రోజు’ను ఏర్పరుస్తాడు. జ్యోతిర్మయుడు, శుభంకరుడు. ఛేదించడానికి వీలులేనివాడు. జగదీశుడు. అచ్యుతుడు. జన్మరహితుడు ముల్లోకాలకు చూడామణి. భక్తుల అభీష్టాలను నెరవేర్చే వరప్రదుడు. దినానికి మణి మార్తాండుడు. సృష్టికి మొదటివాడు. శుభస్వరూపుడు. అటువంటి సూర్యుని ధ్యానించాలని పేర్కొన్న మన పెద్దలు,

‘యేనేమా విశ్వాభువనాని తత్సుః
తతఃక్షత్రం బలమోజశ్చ జాతమ్’ అని చెప్పారు. అంటే,ఈ విశ్వం సూర్యుని వలన మనగలుగుతోంది. జీవరాశులు, తమకు కావలసిన శక్తిని ఆయన నుంచి పొందుతున్నాయని అర్థం. కాబట్టి, వేదకాలం నుంచే మన వాళ్ళకు సౌరశక్తిని గురించిన అవగాహన ఉన్నట్లేగా!

హిందూకాల మానం

ఆధునిక విజ్ఞానశాస్త్రం, ఈ భూమిపై సృష్టి సుమారు రెండువందల కోట్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైనట్లు గణిస్తోంది. మన జ్యోతిష్యశాస్త్ర లెక్కల ప్రకారం చూసినప్పుడు కూడ ఈ లెక్క సరిపోతుండటాన్ని మనం గమనించవచ్చు.

కాలాన్ని మనవాళ్ళు రోజు, కార్తె, పక్షం, మాసం, ఋతువు, ఆయనం, సంవత్సరం, పుష్కరం, బృహత్కాలం అంటూ లెక్కించుకుంటూ పోతూ, మహాయుగం దాకా గణించు కుంటూ వెళ్లారు. కలియుగానికి (4,32,000 సంవత్సరాలు) రెట్టింపుకాలాన్ని ద్వాపర యుగంగా, కలియుగానికి మూడురెట్లు కాలాన్ని త్రేతాయుగంగా, కలియుగానికి నాలుగురెట్లు కాలాన్ని కృతయుగంగా సూచించారు. ఈ నాలుగు యుగాలు కలిసి ఒక మన్వంతరం. అలాంటి 14 మన్వంతాలు కలిస్తే ఒక కల్పకం. ఒక కల్పకం బ్రహ్మదేవునికి పగలైతే, మరొక కల్పకం రాత్రవుతుంది. ఇలా లెక్కించినపుడు ఒక కల్పకం 432 కోట్ల సౌర సంవత్సరాలకు సమానమవుతుండటం విశేషం! అదే మన పూర్వుల ప్రతిభ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here