రెడ్లవాడ

27
History of old village redlawada
మహబూబాబాద్ జిల్లా చింతనెక్కొండ మండలంలోని రెడ్లవాడ పురాతనమైన గ్రామం. ఇక్కడ గ్రామం నడుమ 3 బురుజులు, పాత మట్టిగోడలు కనిపిస్తాయి. ఈ బురుజుల్లో దేవాలయ స్తంభాలు, శిల్పాలు కనిపిస్తున్నాయి. ఈ బురుజుల స్థలం ఎర్రబెల్లి జయధీర్ రావు, విజయకుమార్ రావు గారలదని గ్రామస్తులు చెపుతున్నారు. పూర్వమిక్కడ కోటవంటిది వుండి వుంటుంది. గ్రామంలో ఆంజనేయుని గుడిలో చాముండి, వినాయకుల శిల్పాలున్నాయి. ధ్వజస్తంభం మీద ఆంజనేయుడు, గరుడుడు, విష్ణువినాయకుడు, హంసలు చెక్కివున్నాయి. పూర్వమక్కడ వైష్ణవ దేవాలయముండాలి. బురుజులో కనిపించిన దేవాలయశిథిలాలలో వైష్ణవద్వారపాలకుని శిల్పమొకటి కనిపించింది.
గ్రామంలో మరొకచోట లక్ష్మీనారాయణుని గుడివుంది. వూరికి తూర్పున మర్రికుంట చెరువుకుంట దగ్గరలో శిథిలదేవాలయపు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఆ పరిసరాలను జగిళ్ళు అని అంటారు స్థానికులు. జగిళ్ళు అంటే పూర్వపు చతుశ్శాల భవంతులలో వుండే నడిమిల్లు. అంటే ఆ చోట పాతవూరు వుండివుంటుంది. అంతేగాక ఆ ప్రాంతంలో పెదరాతియుగపు పెట్టెసమాధులు(సిస్టులు) బంతిరాళ్ళతో(స్టోన్ సర్కిళ్ళు) వున్నాయి. అక్కడికి సమీపంలోని నల్లగుట్టల్లో ఆదిమానవుల ఆవాసాలైన గుహలున్నాయి.
వూరికి దక్షిణందిక్కు నుంచి ఎస్సారెస్పీ కాలువ(కెనాల్) పోతున్నది.దానికి దానికి దక్షిణం ఒడ్డున రాతిగుండుకు చెక్కిన అమ్మవారి శిల్పం వుంది. ఈ దేవతకు 12ఆయుధాలతో 12చేతులున్నాయి. పాదాల కింద రాక్షసుల తలలున్నాయి. ఈ దేవతను స్థానికులు గంగమ్మతల్లి అని, విజయోత్సవం అమ్మవారు అని పిలుస్తున్నారు. ఈ దేవత మహాకాళిరూపంలో వుంది. నగ్నత ఎక్కువ. ఆ దేవతకు మొక్కులు చెల్లిస్తున్న భక్తుల శిల్పాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ దేవత జైనతీర్థంకరులలో 8వ తీర్థంకరుడు చంద్రప్రభు శాసనదేవత జ్వాలామాలిని అయివుంటుందని కూడా సందేహమున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here