శ్రీ లక్ష్మి తిరుతమ్మ చరిత్ర (పార్ట్ – 2)

41
Penuganchiprolu Sri Tirupatamma temple history details

స్థలపురాణం:

శ్రీ తిరుపతమ్మ తల్లి వృత్తాంతం క్రీ.శ5 లో జరిగినట్లు గా చెప్పబడుతోంది. శ్రీ తిరుపతి వేంకటేశ్వరుని అనుగ్రహంతో పుట్టిన బిడ్ఢ కావున ఆమెకు తిరుపతమ్మ అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. కృష్ణాజిల్లా అనిగండ్లపాడు గ్రామానికి చెందిన కొల్లాశివరామయ్య, రంగమాంబ లు ఆదర్శదంపతులు. భగవంతుని యందు అపారభక్తి విశ్వాసములుకలిగి,పేదసాదలను ఆదుకొంటూ కీర్తిప్రతిష్టలు గడించిన కుటుంబం వారిది.ధనధాన్య పశు బంధుమిత్రాదులను కొల్లలుగా ఇచ్చిన ఆ భగవంతుడు ఆ కొల్లా వారి కుటుంబానికి సంతానయోగం లేకుండా చేశాడు.సంతానార్ధులై తిరుమలయాత్ర చేసిన ఆదంపతులకు తిరుమలేశుని అనుగ్రహంతో ఆడశిశువు జన్మించింది. శ్రీ తిరుమల వాసుని దివ్య ఆశీస్సులతో పుట్టిన బిడ్డకు తిరుపతమ్మ అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచు కొనసాగిరి. ఆ బిడ్డ పుట్టిన వేళావిశేషమో, ఏమో గాని ఆయింట ధన ధాన్య పశుసంమృధ్ది ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ఆ యిల్లే కాక ఆ గ్రామమంతయు పాడిపంటలతో కళకళలాడుచుండెను. పూవు పుట్టగనే పరిమళించునన్నట్లు చిన్ననాటినుండియు శ్రీ తిరుపతమ్మ భగవంతుని యందు భక్తి విశ్వాసాలను, పెద్దలయందు వినయవిధేయతలను , బీదలయందు దయాదాక్షిణ్యాలను ప్రదర్శిస్తూ అందరికి తలలో నాల్క వలే మెలగు చుండెడిది. ఇదే సమయంలో ప్రక్కనే ఉన్న పెనుగంచిప్రోలు లో తిరుపతమ్మ కు తల్లియైన రంగమాంబ గారి అన్నగారి కుటుంబం నివసిస్తుండేది. కాకాని రామయ్య గారి కుటుంబం పెనుగంచిప్రోలు లో కీర్తి ప్రతిష్ఠలు గల్గిన వ్యవసాయ కుటుంబం . వీరి తమ్ముడు కృష్ణయ్య. అన్నదమ్ములిద్దరు.

penuganchiprolu sri tirupatamma temple history details

బలరామకృష్ణులవలె ఒకే మాట ఒకే బాట గా వ్యవహరించెడి వారు. రామయ్య గారి భార్య పుత్ర సంతానాన్ని కని కాలం చేయడం , మరికొంతకాలానికి రామయ్య కూడ మరణించడంతో ఆ పసివాని ఆలనా పాలనా కృష్ణయ్య దంపతుల మీద పడింది. అతని పేరే మల్లయ్య. అన్నయ్య బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కృష్ణయ్య దంపతులను చూసి ఇరుగు పొరుగు వారు ఆశ్చర్య పోయేవారు.కొంతకాలానికి కృష్ణయ్య-వెంగమాంబా దంపతులకు మగపిల్లవాడు జన్మించాడు . అతనికి గోపయ్య అని నామకరణం చేశారు. కృష్ణయ్య కు వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తూ మల్లయ్య ,గోపయ్య లు పెరిగి పెద్ధ వాళ్లు అయ్యారు. యుక్త వయస్కుడైన మల్లయ్యకు అనిగండ్లపాడుకే చెందిన కన్నేటి వారి ఆడబడుచు చంద్రమ్మ నిచ్చి వివాహం చేశారు. శ్రీ తిరుపతమ్మ ను గోపయ్యకు ఇచ్చి వివాహం చేయడానికి పెద్దలు సంప్రదించుకొని తాంబూలాలు పుచ్చుకున్నారు.ముహూర్తసమయానికి అంగరంగవైభవంగా గోపయ్య తిరుపతమ్మల కళ్యాణం జరిగింది.రెండు గ్రామాల్లోను పండుగ వాతావరణం వెల్లివిరిసింది.తిరుపతమ్మ అత్త వారింట అడుగు పెట్టింది. ఆడపడుచు ను అత్తవారింటికి పంపిస్తూ సమస్త గృహోపకరణాలతోపాటు ఒక గోవు ను కూడ అరణం గా పంపించాడు స్ధితిమంతుడైన శివరామయ్య. కొత్తకోడలు రాకతో కాకాని వారింటికి కొత్త కళవచ్చింది. పాడిపంటలు సిరిసంపదలు వృద్ధిచెందాయి.

penuganchiprolu sri tirupatamma temple history details

లక్ష్మీదేవి వచ్చిన వేళావిశేషమని నలుగురు చెప్పుకోసాగారు. క్రమక్రమంగా తోడికోడలు చంద్రమ్మ మనసులో ఈర్ష్యాసూయలు బయలు దేరినాయి. అత్తగారైన వెంకమ్మ మనసును కూడ మార్చి వేసింది. సూటిపోటిమాటలతో తిరుపతమ్మ ను వేధించసాగినారు. ఇదేసమయంలో ముదిరాజు వంశజురాలైన పాపమ్మ వచ్చి, తిరుపతమ్మతో పరిచయంచేసుకొని, ఆవిడకు అన్ని రకాల చేదోడు వాదోడు గా వుంటుండేది. తీరికసమయాలలో భారత,భాగవత,రామాయణాదులతో సద్గ్రంథ కాలక్షేపం చేస్తుండేవారు. కాలం ఎప్పుడూ ఒకేరీతిగా ఉండదు కదా కృష్ణాజిల్లాలో వర్షాబావ పరిస్ధితులేర్పడ్డాయి. కరువుకాటకాలతో జనం వలసలు వెడుతున్నారు. గొడ్లకు మేతదొరకడం గగనమై పోయింది. ఆలమంద ను ఉత్తర ప్రాంత భూముల కు మేత కోసం తోలుకుపోవడానికి నిర్ణయించుకొని ఊరంతా నిర్ణయించుకొంది.ఇంటికి ఒకరు చొప్పున మంద వెనక వెళ్లాలని తీర్మానం.కృష్ణయ్య గారి ఇంటి నుండి గోపయ్య బయలుదేరాడు. భర్త వెళ్లడం తిరపతమ్మకు ఇష్టం లేకపోయినా సందర్భం కాదని మాట్లాడకుండా ఉండిపోయింది. గోపయ్య అడవి వెళ్లినదగ్గరనుండి తిరుపతమ్మ కు అత్త తోడికోడలు పెట్టే ఆరళ్లు కూడ ఎక్కువైనాయి.ఇంతలో తిరుపతమ్మకు కుష్టువ్యాధి సోకటంతో ఆమెను గొడ్లసావిట్లో పడేశారు.ఇన్ని బాధలు పడుతున్నాతిరుపతమ్మ పుట్టింటికి ఒక్కకబురు కూడ చేయలేదు. అన్ని వేళలా పాపమ్మె ఆమెకు చేదోడు వాదోడు గా ఉండేది. ఇంతలో ఆలమందల వద్ద నున్న గోపయ్యకు తిరుపతమ్మ ను గూర్చి ఏవేవో చెడు కలలు రాలడంతో ,తన ఆవులను తోటివారి కప్పగించి పెనుగంచిప్రోలు వచ్చేశాడు. ఇంట్లో తిరుపతమ్మ కనపడలేదు. అమ్మ వదినలు తిరుపతమ్మ పుట్టింటికి వెళ్లిందని అబద్దమాడారు. మునేటి ఒడ్డున అమ్మలక్కల మాటల్లో తిరుపతమ్మ కొచ్చిన కష్టాన్ని విన్న గోపయ్య పరుగు పరుగన గొడ్లసావిడికి చేరుకొన్నాడు. కుళ్లి కృశించి నీరసించిన శరీరంతో గోశాల లోపడివున్న ఇల్లాలును చూచి విహ్వలుడై, ఆమెను పట్టుకొని బోరుబోరు న విలపించాడు గోపయ్య. వెంటనే వెళ్లి అలమందను తోలుకొచ్చేసి ,తిరుపతమ్మ దగ్గరే వుండి ఆరోగ్యాన్ని చూసుకంటానన్నాడు.

penuganchiprolu sri tirupatamma temple history details

తిరుపతమ్మవద్దంటున్నా వినక మందను తోలుకు రావడానికి అడవికి వెళ్లిపోయాడు గోపయ్య .అక్కడ కు వెళ్లేసరికి పరిస్థితి
అస్తవ్యస్దంగా ఉంది. తిరుపతమ్మ పుట్టింటినుండి అరణంగా తెచ్చుకున్నఆవు ను పెద్దపులి నోట కరుచుకు పోయిందని చెప్పారు తోటిస్నేహితులు. అసలే బాధలో వున్న గోపయ్య ఆవేశంతో గండ్రగొడ్డలి పట్టుకొని పులి గుహలోకి ప్రవేశించాడు. విథివక్రించింది . గోపయ్య నేలకొరిగాడు. ఆవిషయం తన యోగశక్తి తో తెలుసుకున్న తిరుపతమ్మ యోగాగ్ని తో మరణించడానికి సిద్దపడి, గ్రామపెద్దయైన శ్రీశైలపతి గార్కి పాపమ్మ ద్వారా కబురు చేసింది.చర్చోపచర్చల తరువాత గ్రామపెద్దల అంగీకారం జరిగింది. వెంకమ్మ, చంద్రమ్మలు తమ తప్పు తెలుసు కొని తిరుపతమ్మను శరణువేడారు. పాపమాంబ వంశము ఆచంద్ర తారార్కము అభివృధ్ధి చెందుతూ,నిత్యనైవేద్య దీపధూప అర్చనహారతులు తిరుపతమ్మకు పాపమ్మవంశము వారినుండే లభించేటట్లు ఆదేశించిన తిరుపతమ్మ పసుపు కుంకుమలతో కూడిన పూజాపళ్లాన్ని పాపమ్మకు అందించింది . పాపమ్మ కడసారిగా కన్నీటితో తిరుపతమ్మకు పాదాభిషేకం చేసింది . సాయంసంథ్యావేళలొ ,బాజాభజంత్రీలుమారుమ్రోగుతుంటే, దిక్కులు పిక్కటిల్లేలా జనసందోహం జయజయథ్వానాలు చేస్తుంటే తిరుపతమ్మ యోగాగ్ని ప్రవేశం చేసింది. ఆప్రదేశంలో తిరుపతమ్మ తల్లి చెప్పిన ప్రకారం” మంగళసూత్రము కుంకుమ భరిణె దేదీపేయమానంగా ప్రకాశించే గోపయ్య తిరువతమ్మ” ల విగ్రహాలు లభించాయి.

penuganchiprolu sri tirupatamma temple history details

గ్రామపెద్దలైన శ్రీశైలపతి గారు ఆప్రదేశంలోనే దివ్యయంత్రాలతో ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయాన్ని నిర్మించారు. తమ్ముడి మరణం మరదలు యోగాగ్ని ప్రవేశంతో దిగులు పడి మంచం పట్టి మరణించాడు మల్లయ్య. తన తప్పులు తెలుసుకున్న చంద్రమ్మ పసిపాపతో సహా సతీసహగమనం చేసింది. శ్రీశైలపతి గార్కి తిరుపతమ్మ కలలో కన్పించి చెప్పడంతో, చంద్రమ్మ మల్లయ్యలకు కూడ అమ్మవారి ఆలయానికి దక్షిణంగా గుడి కట్టించారు. ముందుగా చంద్రమ్మ దంపతులను దర్శించిన తరువాతే అమ్మవారిని దర్శిచాలనేది నియమం. ఆనాటి నుండి తిరుపతమ్మ పేరంటాలు భక్తుల పాలిట కామధేనువై కోరిన కోరికలను తీరుస్తూ, భక్తులమొక్కులను అందుకుంటూ కాపాడుతోంది. చారిత్రకత. పెనుగంచిప్రోలు చారిత్రక నగరమని ఇంతకు ముందే ప్రస్తావించాను. 11, 12 శతాబ్దాల్లో గుడిమెట్ల రాజ్యాన్నిపరిపాలించిన చాగి పోతరాజు కుమారులు దోరపరాజు గణపతిరాజు మనమ గణపతి రాజు వేయించిన శాసనాలు పెనుగంచప్రోలు, వేదాద్రి ,కొనకంచి నవాబుపేట, ముక్త్యాల, ముప్పాళ్ల, మాగల్లు జుజ్జూరు మొదలైన ప్రాంతాల్లో లభించాయి. కాకతీయ శిల్పశిథిలాలు ఇప్పటికీ తవ్వకాల్లో బయటపడుతూనే ఉన్నాయి. ఉంటాయి కూడ. మునేటికి వరద వచ్చి తీసేసి నప్పుడల్లా ఏట్లో ఏవేవో కట్టడాలు ,నిర్మాణాలు బయటపడటం సాథారణమై పోయింది. శాసనము ఆనాడు నందిగామ తహశీల్దారుగా ఉన్న మహమ్మద్ మొయినుద్దీన్ గారు తిరుపతమ్మ మహిమను తెలుసుకొని , అమ్మ వారిఆలయనిర్మాణనిమిత్తం రెండు ఎకరాలస్థలాన్ని వ్రాసి యిచ్చిన శాసనం ఇప్పటికి ఆలయంలో మనకు కన్పిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here