భాగవతం — 3

28
SAMPOORNA BHAGAVATAM

భాగవత ప్రవచనము ఎవరి కొరకు చేయబడినది? భాగవతమును అందరు వినలేరు అని శాస్త్రం చెపుతోంది. భాగవతమును శ్రవణం చేయడం అనేది కొన్నికోట్ల కోట్ల జన్మల తరువాత మాత్రమే జరుగుతుంది. వ్యాసుడు మిగిలిన అన్ని పురాణములను రచించినట్లు భాగవత పురాణమును రచించలేదు. అప్పటికి ఆయన పదిహేడు పురాణములను రచన చేసేశారు. అన్నీ రచించేసిన తరువాత ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమమునకు దగ్గరలో కూర్చుని ఉన్నారు. మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది. ఏదో నిరాశ! ఏదో లోటు! తానేదో తక్కువ చేశాననే భావన! ‘ఎక్కడో ఏదో చెయ్యడంలో ఏదో అసంపూర్తిగా మిగిలిపోయింది’ అని అనుకున్నారు.

ఆయన చేసిన కార్యక్రమాన్ని ఆలోచించారు. ‘వేదరాశినంతటినీ విభాగం చేశాను. పదిహేడు పురాణములను రచించాను. బ్రహ్మసూత్రములను రచించాను. పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను. ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను. ధ్యానం చేశాను. అయినా నా మనస్సుకు ఎందుకో లోటుగా ఉంది. ఎందుకు ఇంత లోటుగా ఉన్నది’ అని ఆలోచన చేశారు.

ఆ ఆలోచన చేసినపుడు మహానుభావుడు నారదుడు దర్శనం ఇచ్చారు. మనకు రామాయణంలో మొదట సంక్షేప రామాయణం చెప్పినవాడూ నారదుడే. భాగవతంలో సంక్షేప భాగవతం చెప్పినవాడూ నారదుడే. ‘నారం దదాతి ఇతి నారదః’ – ఆయన జ్ఞానమును ఇస్తూ ఉంటారు. అటువంటి నారదుడు వచ్చి వ్యాసునితో ఒకమాట చెప్పారు. ‘వ్యాసా, నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో, ఏదో లోటుతో ఉన్నదో తెలుసా? నువ్వు ఇన్ని విషయములు రచించావు. భారతమును రచించావు. కానీ భారతంలో కృష్ణకథ ఎక్కడ చెప్పినా ధర్మం తప్పినటువంటి కౌరవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో, ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో అను ప్రధాన కథకు కృష్ణ కథను అనుసంధానం చేశావు. అంతేతప్ప కృష్ణ భక్తుల చరిత్రని, ఈ ప్రపంచమంతా ఎలా పరిఢవిల్లుతున్నదో విశ్వము ఎలా సృష్టించబడిందో పంచభూతములు ఎలావచ్చాయో, భగవంతుని నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్తయై స్థితికర్తయై, ప్రళయ కర్తయై ఈలోకమును ఆయన ఎలా పరిపాలన చేస్తున్నాడో నీవు ఎక్కడా చెప్పలేదు. ఆకారణం చేత నీమనస్సులో ఎక్కడో చిన్నలోటు ఏర్పడింది. ఇది పూర్తిచేయడానికి నీవు భాగవత రచన చెయ్యి’ అని ప్రబోధం చేశారు.

అపుడు వ్యాసభగవానుడు ఆనందమును పొందినవాడై ధ్యానమగ్నుడై ఆచమనం చేసి కూర్చుని భాగవతమును రచించడం ప్రారంభం చేశారు. ఇంత చేసిన తరువాత, ఏది చెయ్యడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో, ఏది అందించడం చేత తనజన్మ సార్ధకత పొందుతుందని అనుకున్నాడో, ఏది అందించిన తరువాత ఏది తెలుసుకున్న తరువాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో, కొన్ని కోట్ల జన్మలనుండి మనస్సు ఏది పట్టుకొనక పోవడం వలన అలా జరిగిందో, ఏది పట్టుకోవడం వలన మనుష్య జన్మకు సార్ధకత సిద్ధిస్తుందో అటువంటి మహౌషధమును మహానుభావుడు అందించడం ప్రారంభించారు.
అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు.అది సాక్షాత్తు ఉపనిషత్తుల సారాంశం. జ్ఞానం అంతా కూడా భాగవతమునందు నిక్షేపింపబడినది. దీనిని చెప్పడానికి శుకబ్రహ్మ మాత్రమే తగినవ్యక్తి. అందుకని తన కుమారుడయిన శుకబ్రహ్మకి భాగవతమును ప్రబోధం చేశారు.

ఆ భాగవతమును శుకబ్రహ్మ పరీక్షన్మహారాజుగారికి ఏడురోజులు చెప్పారు. ఎటువంటి పరిస్థితులలో చెప్పారు? భాగవతం చెప్పబడిన పరిస్థితిని మీరు విచారణ చేయాలి. చెప్పినది ఏడురోజులే! అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు. ఎందుకు ఏడురోజులు చెప్పవలసి వచ్చింది? భాగవతమును సప్తాహముగా చెప్పుకోవడం వెనుక ఒక రహస్యం ఉంది. ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి. – డెబ్బది సంవత్సరములు కాని, తొంబది సంవత్సరములు కాని లేక –
‘శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియః ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి’ నూరు సంవత్సరములు కాని పూర్ణంగా బ్రతకనివ్వండి – కాని ఎన్నిరోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే ఏడురోజులే బ్రతికినట్లు అని మనం తెలుసుకోవాలి. ఎందుచేత? ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని – ఇంతకన్నా ఇక రోజులు లేవు. ఎనిమిదవ రోజు యికలేదు. ఎప్పుడు మరణిస్తాడు? ఈ ఏడు రోజులలోనే మరణిస్తాడు.

ఎంత గొప్పవాడయినా వాడు పోవడానికి ఎనిమిదవ రోజు ఉండదు. ఎవ్వరయినా ఆ ఏడురోజులలోనే వెళ్లిపోవాలి. ఆ ఏడూ రోజులలోనే పుట్టాలి. ఆ ఏడురోజులలోనే ఉండాలి. ఆ ఏడు రోజులలోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహము అంటే నీవు ఏరోజున భగవంతుణ్ణి స్మరించడం మానివేశావో ఆ రోజు పరమ అమంగళకరమయిన రోజు. ఆరోజు భగవంతుని యెడల విస్మృతి కలిగింది కాబట్టి తన భగవన్నామమును పలకలేదు. ఈశ్వరుడికి నమస్కరించలేదు. ఈశ్వరుని గురించిన తలంపు లేదు. ఆరోజున తను ఉంది మరణించిన వానితో సమానం. కాబట్టి ఆ రోజున ఇంట్లో ఏమి తిరిగింది? నడయాడిన ప్రేతము ఒకటి తిరిగింది. ఒక శవం ఆ ఇంట్లో నడిచింది. కాబట్టి ఆరోజు ఆ ఇల్లు అమంగళం అయింది. కాబట్టి ఏది బ్రతుకు? నిజమయిన బ్రతుకు ఏది? నిజమయిన బ్రతుకు ఈశ్వరుని నామస్మరణమే! భగవంతుని నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికివున్నవాడు. అయితే భగవంతుని నామము స్మరిద్దామంటే ఆ నామము అంత తేలికగా స్మరణకు వస్తుందా! ఆ వస్తువునందు నీకు ప్రీతి ఏర్పడితే నీమనస్సు భగవన్నామమును స్మరించడానికి అవరోధం ఉండదు. మీరు ఎక్కడ కూర్చుని వున్నా మీ మనస్సు మీకు ఇష్టమయిన వస్తువును గూర్చి స్మరిస్తూ ఉంటుంది. మనస్సు ఆవస్తువునండు ప్రీతిచెందింది కాబట్టి ఎప్పుడూ ఆ వస్తువును స్మరిస్తూ ఉంటుంది. మీ మనస్సు ఈశ్వరునియందు ప్రీతిచెందకపోతే ఈశ్వరుని నామమును స్మరించదు. ఇప్పుడు మనస్సు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బలమును వ్యాసభగవానుడు భాగవతమునందు ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే భాగవతమును ఎవరు వింటారో వారి మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here