మనుష్యధర్మం part -2

23
What Is The Meaning Of DHARMA

ఇవికాక, ఇంకా కొన్ని పనులు మనుష్యుడు చేస్తుంటాడు. ఒక పెద్ద భవనం నిర్మించి దానిపై సిలువస్థాపించి అక్కడకు తరచు వెళ్ళుతుంటాడు లేదా రుద్రాక్షలనుధరించి, విభూతిపూలుముకొని’శివ శివ’యని జపంచేస్తుంటాడు. మరొకడు ఊద్ధ్వపుండ్రాలు పెట్టుకొని ఊరూరూ తిరుగుతుంటాడు. వీనివలన ఆకలి తీరదు. బట్టలు దొరకవు. ఒకడు సంధ్యావందనం చేస్తాడు. మరొకడు శ్రాధ్ధం పెడతాడు. ఇంకొకడు తర్పణాలు చేస్తుంటాడు. వేరొకడు కొండలుమలిచి కోవెలలు కడతాడు. మరికొందరు మతముపేరిట కలహభోజనంచేస్తూ తలలు పగులగొట్టుకొంటూ వుంటారు. వీనివలన ప్రయోజనమేమి? ఇవిచాలవన్నట్టు ఊరూరా భజనమందిరాలు, ప్రతిరాత్రీ గొంతుక లెండిపోయేటట్లు భజనచేస్తుంటారు. దీనికీ ఆఫీసుపనికిన్నీ ఏవిధమైన సంబంధంలేదు. ఇది అవసరమా?

ఎవనికైనా నీకు ఒకపూట భోజనంకావాలా? లేక పదిరూపాయలుకావాలా? అని అడిగితే రూపాయలే ఇవ్వమని కోరుకుంటాడు. రూపాయలను నిలువచేసుకొనే సుళువున్నది. ఒకపూట అవసరం అన్నం తీరిస్తే, పదిరోజుల అవసరం పది రూపాయలు తీరుస్తవి. దీర్ఘకాలిక ప్రయోజనాన్నే ప్రతివారూ వాంఛిస్తారు. వాంఛలు అపరిమితమై పోయినవి ఈరోజుల్లో. పూర్వం బస్సులు, రైలుబండ్లు ఉండేవి కావు. ఎంతదూరమైనా నడచి వెళ్ళవలసివచ్చేది. దానికి తగినట్లే ప్రయాణావసరాలు పరిమితిలో ఉండేవి. ఇప్పుడట్లాకాదు. ఎక్కడికైనా పోవచ్చు ఎంతైనా ఖర్చుపెట్టవచ్చు. అందుచే అవసరాలూ, అవి లభించడానికి చేసే యత్నాలూ అపరిమితమైపోయినవి. ఆకాలంలో ఎంతదూరమైనా నడచిపోయేవారు. కాళ్ళు బలపడేవి. ఇప్పుడు అరమైలుదూరం వెళ్ళడానికి రిక్షా, టాక్సీలు అవసరం. మితి అనే మాట మనకోశంలో ఏమూలా గాలించినా కనబడదు.

దూరాలోచనలో, భావికాలభాగ్యానికి ద్రవ్యం అర్జిస్తున్నాం. ఎంతని నిలువచేయడం? వేయిరూపాయలా, పదివేలా, లక్షా? ఆయుఃపర్యంతం ఆనందంగా ఉండాలని అందరి వాంఛ. మనకెంత ఆయువో మన మెరుగం. అది ఆ పరమేశ్వరునికే తెలియాలి.
మనం సేకరించే వస్తువులు ప్రాణ మున్నంతవరకూ ప్రయోజనపడతవనుటలో ఏమాత్రం సందేహంలేదు. కాని అటుతర్వాత అవి నిష్ప్రయోజనమైపోతున్నవి. భవిష్యత్సౌఖ్యానికై పలువిధాల పరిశ్రమిస్తున్నా, నిరంతర సౌఖ్యం కలిగించే పనులు చేస్తున్నామా అంటే లేదు. నశించేది దేహమేకాని ఆత్మకాదు. అవినాశియైన ఆత్మలాభానికై చేసే పనులు, దేహానంతరం కరచరణాదు లుండవు కనుక, ఇహమందే నిర్వర్తించుకోవాలి. అంటేఆత్మజ్ఞానం మనంముందు జాగ్రత్తగా ఇన్యూర్ చేసుకోవాలి.

‘ఈలోకం వాస్తవం. దీన్ని ఆలోకిస్తున్నాము కనుక, పరలోకం మనం చూడలేదు. ఇహంలో సౌఖ్యంగా వుండవలసిన విధి ఎంతైనా వుంది. మరణించిన పిదప మనమున్నామో లేదో ఎవరికెరుక?’ అని ఎవరయినా అంటే, ఒకవేళ ఉన్నామనే అనుకుందాం. అపుడేమిచేయాలి? ఏడవాలా? ”నాస్తిచే న్నాస్తినో హనిః అస్తిచే న్నాస్తికో హతః” దేహాంతరంజీవమున్నదనుకొన్నవాడు రెండువిధాల బాగుపడతాడు. లేదనుకొన్న నాస్తికుడు మోసపోతాడు. సత్కార్యాలవల్ల మంచి ఎన్నడూఉంది.

ఎక్కడికైనా ప్రయాణం పెట్టుకొన్నపుడు మనస్సు ప్రశాంతంగాఉండాలని కోరుకొన్నట్లే అంతిమప్రయాణంకూడా ఆనందగాఉండాలని కోరుకొంటే, దానికి తగిన విధులను నిర్వర్తించాలి. చేసే కర్మకు ప్రస్తుతం ఫలం లేకపోయినా, పిదప తప్పక ఉంటుందన్నది జ్ఞానమార్గంలో మనకు బాగా అవగతమవుతుంది. ఒకశక్తికి ప్రతిఫలం ఎప్పుడైనా ఉంటుందన్న న్యూటన్ సిద్ధాంతం మన పెద్దలు ఏనాడో గుర్తించి ఉన్నారు. క్రైస్తవులు జన్మాంతరసిద్ధాంతాన్ని ఒప్పుకోరు. కాని మరణాంతరం ఒక న్యాయతీర్పు ఉందని అంటారు. దానిలో కర్మానుసారం స్వర్గమో, నకరమో నిశ్చయింపబడుతుంది అనిన్నీ అంటారు. సుఖదుఃఖాలు అనుభవించిన మృతదేహాన్ని పెట్టెలో పూడ్చరని అనుకొందాం. అయినప్పటికీ దేశాంతరంలో మళ్లా సుఖదుఃఖాలను అనుభవించేశక్తి దానికి వున్నదనే నమ్మికకదా ఈన్యాయతీర్పు చెబుతుంది. కాగా వారికి తెలియకుండానే జన్మాంతరసిద్ధాంతంలో విశ్వాసమున్న సంగతి ఇది సూచిస్తుంది.

మన సుఖదుఃఖాలకు కారణం పూర్వంచేసుకొన్న కర్మ. పురాకృత ఫలం ఈజన్మ. ఈజన్మలోని సుకృతదుష్కృతాలనూ, తత్ఫలితమైన సుఖదుఃఖాలను అనుభవించేటందుకూ మరొక జన్మ అవసరంకాదా?
అందుచే మతబోధనలను మనం విశ్వసించి, మతసంబంధమైన కార్యాలు చేస్తే ఇహానికేకాక పరానికికూడా ఫలితం కలిగిస్తుంది.

వనవాసానికి బయలుదేరిన శ్రీరామచంద్రమూర్తిని కౌసల్యాదేవి-

యం పాలయసి ధర్మం త్వం ధృత్వా చ నియమేన చ,
సవై రాఘవశార్దూల ధర్మస్త్వా మభిరక్షతు||

అని అశీర్వదిస్తుంది. ఆయన ఏధర్మాన్ని అనుష్ఠిస్తున్నాడో ఆ ధర్మమే ఆయనను కాపాడుతుందని ఆతల్లి విశ్వసించింది. ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనల రక్షిస్తుంది. ఈశ్వరరాజ్యంలో చెలామణిఅయ్యే కాసులే ధర్మం.

నిరంతరానందాన్ని పొందాలంటే ఏంచేయాలి? చేసే ప్రతికార్యం ఈశ్వరార్పణచేయాలి. అట్టి కర్మ అనీశ్వరమైన ఆనందాన్నిస్తుంది. నూతనమార్గాలను త్రొక్కకుండా, పరంపరగా మన పెద్దలు వేనిని ఆచరించినారో, దానినే, మనమూ మన మతం చెప్పినచందంగా ఆచరిస్తే, అవి సులభంగానూ ఉంటవి, సౌఖ్యాన్ని ఇస్తవి. ఒక కార్యం చెడ్డదైనా సరే, స్వకీయమైన కామక్రోధకారణంగా కాక, స్వకుక్షింభరిత్వం కోసంకాక ఒక అధికవిశేషాన్ని అర్థించి, దాన్ని ఈశ్వరార్పిత చేస్తే అది ధర్మమే.

మరి మనం ఏధర్మాన్ని పాటించాలి? పరంపరగావచ్చే ఆచారాలు మన పెద్దలనుష్ఠించి పరమసౌఖ్యాన్ని అనుభవించినట్లు తెలుస్తున్నది. నూతనపంథాలోని బాగోగులు మనకు తెలియవు. స్వప్రయోజనంకోసంకాక, బంధుస్నేహవర్గప్రీతి పొందడంకోసంకాక, సాముదాయిక క్షేమంకోసంకాక స్వాత్మలాభప్రాప్తికోసి పరంపరగా మనకు ప్రాప్తించిన యేసత్కార్యాలను నియమంతో, ధైర్యంతో, ఈశ్వరార్పణ బుద్ధితో అనుష్ఠిస్తామో అదే ధర్మం. మనోవాక్కాయాలనే త్రికరణాలతో ప్రతికార్యమూ ధర్మబద్ధంగా ఉండాలి. మన ద్రవ్యాన్ని ధర్మద్రవ్యంగా మార్చుకోవాలి. అది కాలపరిణామవశం కాక సార్వకాలిక ప్రమోజనకంగా ఉండాలి.

మనుష్యుడు నిరంతరమూ ఉన్నతికి దారితీసే పనులు చేయాలి. ప్రాణివర్గంలో మనుష్యుడొక్కడే నిలువుగాపెరిగేది. తక్కినవన్నీ అడ్డంగా పెరిగేవి. అవి తిర్యక్కులు. మనుష్యుడోక్కడే నేరుగా ఎత్తుగా పైకిపైకి పోయేవాడు. నిలువుగా పెరిగే వాని రూపం వాని ఉన్నతిని చాటుతుంది. ధర్మాన్ని పాటించిన రామచంద్రమూర్తికి తిర్యక్కులు సహితం సాయపడినవి. అధర్మవర్తనం చేసిన రావణాసురునకు సొంతమ్ముడే సాయపడలేదు.

యాంతి న్యాయప్రవృత్తస్య తిర్యంచోపి సహాయాతాం,
ఆపంథానం తు గచ్ఛంతం సోదరోపి విముంచతి||

– అనర్ఘరాఘవం.

ధర్మానికి ఏకాలంలోనూ, ఏదేశంలోనూ అడ్డులేదు. అందుచే ధర్మాన్ని పాటించడం మనకు అత్యవసరమైన ధర్మం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here