మనుష్యధర్మం – Part1

21
What Is The Meaning Of DHARMA

ప్రపంచమందలి ప్రతిప్రాణీ ఏదో ఒక పనిలో మునిగి తేలుతూ ఉండటం మనం నిత్యమూ చూచేవిషయం. ఒక్క మానవులేకాక, పశుపక్షి కీటకాదులుకూడా ఎడతెగక ఏదో ఒకపని చేస్తూనే ఉంటవి. చీమ బియ్యపుగింజను శ్రమపడి తన కన్నంలోనికి లాక్కో వెళుతూంటుంది. పావురాలు ఆకాశంలో ఎగురుతవి. నత్త మందగమనం చేస్తూవుంటుంది. ఫైళ్ళను మోసుకొని మనుష్యుడు కచ్చేరీలకు వెళ్ళుతుంటాడు. అది లేకపోతే ఏమూలనో ఒక పొలంలో పైరుపండిస్తూంటాడు. పనిలేనివాడొక్కడూలేడు. అనివార్యంగా అనవరతం పని, పని, పని, చేస్తూవుంది ప్రాణిలోకం. అందుకనే గీతలో భగవానుడున్నాడు. ”నహికశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మకృత్” ఈ విషయం అందరకూ అనుభవమే.

కష్టంలేకుండా సుఖంగా కాలక్షేపం చెయ్యాలంటే మనం ఎన్నోసదుపాయాలు చేసుకోవాలి వానికి పని అవసరం. కర్మచేయకుండా ఒక క్షణం కూర్చోవటమంత కష్టమైన పని మరొకటి ఉండదు. అనుదినం ఎదుర్కొనవలసినవాటిలో క్షుద్భాధ ఒకటి. ఈక్షుద్వ్యాధికి అనుదిన చికిత్స చేస్తేకాని శమించడమంటూలేదు. వ్యాధికి మందు ఎట్లు పరిమితంగా తీసుకొంటామో, తియ్యని మందని అధికప్రమాణం ఎట్లా గ్రహించమో అట్లే ఆకలిని అనుసరించి ఆహారానికి ఒక నియతి, నియమం ఉండాలి.

ఐతే ఆకలితీరితే పనులు నిలచిపోతవా? ధనవంతునికి అన్నానికి కొరతలేదు. వానికి పనిచేయవలసిన అగత్యమేమి? నిజానికి వానికున్న పనులతొందర మరొకని కుండదు. సంపాదించింది జాగ్రత్త చేయాలి, మరింత సంపాదించాలి, మరింత కూడబెట్టాలి, మరింత జాగరూకత-ఇట్లు వాని కార్యపరంపరకు అంతంలేదు.

స్వదేహరక్షణానికి కొన్నిపనులు. మాతాపితృభార్యాసుతులకు సంబంధించిన పనులు కొన్ని, పాలకోసంఉంచుకొన్న పశువులరక్షణ, ఇవి చాలవన్నట్టు మోజుకొద్దీ పెంచే పిల్లి, ఇంటినికాచేకుక్క, వీనికైపడేపాట్లు-సేవకులు, స్నేహితులూ వీరికై చేయవలసినపనులు, గ్రామసంబంధమైన పనులు మనిషి జీవితాన్ని కర్మశృంఖలాలలో బంధించివేస్తున్నవి.
దంతధావనాదులూ, మజ్జన భోజనాదులూ సొంతపనులు, గృహనిర్మాణమూ, జీవనోపాధికి వలసిన వస్తుసంపాదనా తనకేకాక, తనకు దగ్గరగా సంబంధించిన వారికిన్నీ ఉపయోగపడేవి. రోడ్లువేయటం, కాలువలు త్రవ్వడం, ఆసుపత్రులు కట్టడం సామాజిక కార్యాలు. బీదలకు దానం చేయడం, రోగులకు శుశ్రూషచేయడం సానుభూతితెలిపే పనులు. వార్ధక్యంలో తమపనులు తాము చక్కబెట్టుకోలేక పోయినపుడు వారికి చేసేసేవ ఋణం తీర్చుకొనేపని. శైశవంలో తల్లిదండ్రులచే పాలింపబడి, వారి వృద్ధాప్యంలో తాను పెద్దవాడైవారికి చేసేసేవ ఈలాంటిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here