ద్యానం గురించి మీకు తెలియని నిజాలు

39
The Power of Meditation and Yoga

మనసు పోయిన ప్రతిచోటుకి కళ్ళు పోకూడదు. కళ్ళు వెళ్లినంత మేర మనిషి వెళ్ళకూడదంటారు పెద్దలు. మనసు చాలా చిత్రమైనది. విచిత్రాలు చేయిస్తుంది. మహావిచిత్రాలు విచిత్రమైనది. చంచలమైనది. కోతిలా ఆడుతుంది. మనల్ని ఆడిస్తుంది. ఆట పట్టిస్తుంది, ఆందోళన చేస్తుంది. చేయిస్తుంది అదే కోతిని మనం ఎక్కడ నొక్కాలో ఏ రకంగా తొక్కాలో అక్కడ నొక్క గలిగితే, ఆ రకంగా తొక్కగలిస్తే అది తోక ముడుస్తుంది. అదంత సులభమా? కానే కాదు. అదొక యజ్ఞం. అదొక దుర్బేధ్యమైన విషయం. దృఢ చిత్తం, అవిచ్ఛమైన, అవిశ్రాంతమైన అనంతమైన కఠోర సాధన ద్వారానే సాధ్యం అభ్యాసం చేయాలి. ఎంతో కష్టించాలి. ఎన్నో కష్టాలు పడాలి. చిత్తశుద్ధి కావాలి, ఏకాగ్రత ఉండాలి ఏకాగ్రత కుదరాలంటే మనసు శాంతంగా ఉండాలి. దానికి ప్రశాంతత కావాలి.

The Power of Meditation and Yoga

ఒకాయన ఓ మంత్రాన్ని జపం చేయాలని, తన ఇంటిలో కూచుని జపం ప్రారంభించేడు. ఇంతలో తన ఇంట్లో ఉన్న వారందరూ లేచారు. వారి చర్యలు, మాటలు, వాళ్ళు చేసే పనులవల్ల శబ్దాలవల్ల అతని జపం చేయడానికి అవసరమైన దృష్టి ఏకాగ్రత కుదరలేదు. ఇంటిలో శాంతిలేదని గ్రహించేడు. ఇంట్లో విసిగిపోయేడు. ఏం చేయాలా అని ఆలోచించేడు. తిన్నగా దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళిపోయేడు. మంచి ప్రదేశం చూసుకుని ఓ చెట్టుక్రింద ఎంత ప్రశాంతంగా ఉందో అనుకుని, మహా సంతోషించి, ఆ చెట్టుక్రింద తన జపంచేయటం మొదలెట్టేడు. కొంచెంసేపు గడిచింది. జపం సాగుతోంది. ఒక్కసారి చెట్టుమీద ఉన్న పక్షులు అరవడం మొదలుపెట్టేయి. పక్షుల గోల అధికమవుతోంది. దానికితోడు పక్షులు అతనిమీద రెట్టలు వేస్తున్నాయి. అతడికి చిరాకు ఎత్తుతోంది. సాధనకు భంగం కలిగింది. ‘‘అటు ఇంట్లో పిల్లలగోల అడవిలో పిట్టల గోల, నాకు ఈ జన్మలో ధ్యానంచేసుకునే అదృష్టం లేదు. మళ్ళీ జన్మలోనైనా ఆ అవకాశం అనుగ్రహించమని ప్రార్థిస్తూ జీవితాన్ని అంతం చేసుకుందామన్నాడు. కొన్ని కట్టెలు తెచ్చేడు. చితిగా పేర్చుకున్నాడు. నిప్పుపెట్టేడు. ఆ మంటల్లోకి దూకాలని సిద్ధపడ్డాడు. దూరంగా ఎక్కడ్నుంచో ‘‘ఆగాగు’’అన్న అరుపు వినబడింది. అతను ఆ అరుపు ఎవరిదో అని ఇటుఅటు చూస్తుండగా ఓ ముసలాయన వచ్చేడు.

The Power of Meditation and Yoga
‘‘నాయనా! నువ్వు మంటల్లో దూకు. నీ ప్రాణం అంతంచేసుకో. మాకేమీ అభ్యంతరంలేదు. కానీ గాలి ఇటువైపునుంచి మేము నివాసముంటున్న గుడిసెలవైపు వీస్తోంది. మనిషి సజీవంగా కాలుతూ ఉంటే, కమురు కంపును మేము సహించలేము. కాబట్టి గాలి దిశ మరోవైపుకు మారేటంతవరకు వేచి ఉండు. గాలి మరోవైపు మారేక నీ ఇష్ఠం వచ్చిన పని నువ్వుచేసుకో. అంతవరకు ఆగలేకపోతే మరోచోటుకి వెళ్ళిపో’’ అన్నాడు. ఈ మాటలు ధ్యానం చేయాలనుకున్న వ్యక్తి విన్నాడు. ఏం చేయాలో పాలుపోలేదు. నేను చచ్చిపోవటానికి కూడా నాకు స్వాతంత్య్రం లేదు. ఆటంకాలు, అంతరాయాలు అంతటా, అన్నింటా వస్తూనే ఉంటాయి. ఈ అడ్డంకులకు అంతు అనేది ఉండదు అని అనుకున్నాడు. బాగా ఆలోచించేడు. నా ఇంటికేపోయి వీలుచూచుకుని మనస్సు నిలకడ చేసుకుంటాను. ధ్యానం చేసుకోడానికి ప్రయత్నం చేస్తాను అని అనుకుని ఇంటికి వెళ్ళిపోయేడు. ఎక్కడ అతను మొదలెట్టేడో అటు తిరిగి ఇటు తిరిగి అతను మళ్ళీ మొదటి స్థానానికే వెళ్ళిపోయేడు.

The Power of Meditation and Yoga
ఇది అందరికీ తెలిసిన కథే. ఎక్కడో ఒకచోట విన్నదో, చదివినదో. చదవడం, వినడం కాదు. అసలు గ్రహించాలి. ధ్యానం చేసుకోవాలన్నా జపం చేసుకోవాలన్నా ఏకాంతమనేది దానంతట అదిరాదు. ఏకాంతాన్ని మనం తెచ్చుకోవాలి. ఏర్పరచుకోవాలి. ఏర్పాటుచేసుకోవాలి. అభ్యాసంతోనో సాధనతోనో ఏకాంతాన్ని సముపార్జించుకోవాలి. సంపాదించుకోవాలి.
జపానికి, ధ్యానానికి కావలసినది ఏకాగ్రత. దృఢ చిత్తం. ఏకాంతం, ఏకాంత ప్రదేశం కాదు. మొక్కవోని దృఢ చిత్తం ఉంటే ఏకాంతం మన స్వంతమవుతుంది. ఏకాంత ప్రదేశం దానంతటదే మనకి మన మనస్సుకి సిద్ధిస్తుంది. అలవోకగా లభ్యమవుతుంది. మనసు నిర్మలంగా ఉంటే దేనిమీద విపరీతమైన ధ్యాస లేకపోతే కోరికలను నియంత్రించు కోగలగితే చాలు ఏకాగ్రత కలుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here