సరికొత్త అనుభూతి ని ఇచ్చే ఆర్ఎక్స్ 100 రివ్యూ & రేటింగ్

204
Rx100 movie Review & Rating
Rx100 movie Review & Rating
సరికొత్త అనుభూతి కలిగించే చిత్రం
నటీనటుల : కార్తికేయ రెడ్డి , పాయల్ , రావు రమేష్ , రాంకీ
దర్శకుడు : అజయ్
నిర్మాత : అశోక్ రెడ్డి
ఛాయాగ్రాహకుడు : రామిరెడ్డి
కూర్పు : ప్రవీణ్
సంగీతం : భరద్వాజ
చిత్రకథ
శివ (కార్తికేయ) తల్లిదండ్రుల లేని అనాథ. డాడీ (సింధూరపువ్వు రాంకీ) సంరక్షణలోపెరిగి పెద్దవుతాడు. డాడీ గ్రూప్‌లో కీలక సభ్యుడిగా ఉంటాడు. గ్రామ జెడ్పీటీసీ విశ్వనాథం ( రావు రమేష్)కు అండగా ఉంటారు. హుషారుగా, అమాయకంగా ఉండే శివను విశ్వనాథం కూతురు ఇందు (పాయల్ రాజ్‌పుత్) ప్రేమలోకి దింపుతుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శివ ఆమె ప్రపంచంగా జీవిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది.

 

Rx100 movie Review & Rating
Rx100 movie Review & Rating
కథనం
శివ దూకుడు తనంతో ఉండే క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు
పరిచయం చేయడంతో ఆర్ఎక్స్ 100 చిత్ర కథ మొదలవుతుంది. శివ ఆవేశాన్ని డాడీ కంట్రోల్ చేయడం, అలాగే విశ్వనాథం ఎన్నికల్లో గెలుపొందడం లాంటి అంశాలను పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి చక్కగా ఉపయోగించుకొన్నాడు. చాలా సౌమ్యంగా ఉండే శివ అగ్రెసివ్‌గా మారడానికి గల కారణాలను ఫ్యాష్ బ్యాక్‌తో మొదలుపెడుతాడు. ఇందు ఎంట్రీతో తొలిభాగం నాటు రొమాన్స్‌తో వేడెక్కుతుంది. యూత్‌లో జోష్ పెంచే విధంగా లిప్‌లాక్‌లతో సన్నివేశాల్లో కాకపుడుతుంది. ఇలా సాగుతున్న సినిమాకు ఓ మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.
 సెకండాఫ్‌లో కథ ప్రేక్షకుడు ఊహించని విధంగా మరోస్థాయికి వెళ్తుంది. సన్నివేశానికి, సన్నివేశానికి మధ్య వేగం పెరిగి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. క్లైమాక్స్‌లో సాధారణంగా ఊహించిన దాని కన్నా అనేక ట్విస్టులు తెర మీద ఆవిష్కృతం కావడంతో ఆడియెన్స్‌ థ్రిల్‌గా ఫీలవుతారు. కార్తీ, పాయల్, రావు రమేష్, రాంకీ పవర్ ప్యాక్ ఫెర్మార్మెన్స్‌తో క్లైమాక్స్‌ అదిరిపోతుంది. ఒక ఎమోషనల్ ఎండింగ్‌తో సినిమా అద్భుతమైన నోట్‌తో ముగుస్తుంది.
దర్శకుడు
అజయ్ భూపతి మేకింగ్ దర్శకుడు అజయ్ భూపతి నేటివిటి నేపథ్యంగా రాసుకొన్న కథ గ్రామీణ వాతావరణం అద్దం పట్టింది. గ్రామస్థాయి రాజకీయాలు, ఊర్లలో ఉండే నాటు సరసం, ప్రేమను చక్కగా ఒడిసిపట్టుకొని అద్భుతంగా దర్శకుడు తెరకెక్కించాడు. ఫీల్‌గుడ్ అంశాలతో సినిమాను ముందుకు తీసుకెళ్తూ చివరగా ఎమోషనల్ అంశాలతో ముగించడం ఆయన ప్రతిభ గీటురాయిగా నిలిచింది. చివరి 25 నిమిషాల్లో సినిమాను నడిపించిన తీరు శెభాష్ అనిపించేలా ఉంది. తొలిభాగంలో మరికొంత దృష్టిపెట్టి ఉంటే ప్రేక్షకుల్లో ఏమైనా కొంత కలిగే అసంతృప్తిని కూడా తుడిచిపెట్టడానికి ఆస్కారం ఉండేది. ఆర్‌ఎక్ష్ 100 సినిమా చూస్తే కొత్త దర్శకుడు తీసిన సినిమా అని ఎక్కడా అనిపించదు.
Rx100 movie Review & Rating
Rx100 movie Review & Rating
కార్తికేయ : –
శివ పాత్రలో కార్తికేయ కి లభించిన వెరీయేషన్స్
ఇటీవల కాలంలో మరే హీరోకు దక్కలేదని చెప్పవచ్చు. అమాయకుడిగా, ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, అన్యాయానికి గురైన యువకుడిగా, ప్రియురాలి మోసానికి గురై ఆవేదన చెందే ప్రియుడిగా ఇలా ఎన్నో షేడ్స్‌ను ఆ క్యారెక్టర్‌లో చూడవచ్చు. ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌లోను బాగా రాణించాడు. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ ఇరుగదీశాడు. కార్తీకేయ రూపంలో టాలీవుడ్‌కు మరో ప్రతిభావంతుడైన హీరో లభించాడనే చెప్పవచ్చు. సరైనా పాత్రలను ఎంపిక చేసుకుంటే మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంది
పాయల్ :-
పాయల్ రాజ్‌పుత్ పోషించిన ఇందు పాత్ర ఈ మధ్య తెలుగు సినిమాల్లో చూసి ఉండకపోవచ్చు. హీరోయిన్లు పాటలకు, అందాల ఆరబోతకే పరిమితవుతున్నారనే విమర్శకు చెక్ పెట్టే విధంగా ఇందు పాత్రను దర్శకుడు రూపొందించారు. క్యారెక్టర్‌కు తగినట్టే పాయల్ ఆ పాత్రలో జీవించింది. తొలిభాగంలో రొమాంటిక్ సన్నివేశాల్లోనూ డామినేట్ చేసింది. అలాగే సెకండాఫ్‌లో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందనే చెప్పవచ్చు. క్లైమాక్స్‌లో పాయల్ చూపించిన హావభావాలు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగిస్తాయి
రావురమేష్ : –
ఆర్ ఎక్స్ 100 చిత్రంలో రావు రమేస్ మరోసారి చక్కటి పాత్రను పోషించారు. తొలి భాగంలో విశ్వనాథం పాత్రలో నెగిటివ్ షేడ్స్ కనిపించినప్పటికి.. సెకండాఫ్‌లో ఆయన పాత్రను మలిచిన తీరు, ఆ పాత్రలో రావు రమేష్ జీవించిన తీరు ఆడియెన్స్‌ను కట్టిపడేస్తుంది. ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించిన ఆయనకు విశ్వనాథం ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే పాత్ర అని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో రావు రమేష్ నటన అమోఘం అని చెప్పవచ్చు.
రాంకి : –
తెలుగు సినిమాలకు చాలా కాలంగా దూరమైన సింధూరపువ్వు రాంకీ మరోసారి తెరపై మెరుపులు మెరిపించారు. గాడ్ ఫాదర్ లాంటి పాత్రను అవలీలగా రక్తికట్టించాడు. భావోద్వేగాల మధ్య సాగే పాత్రలో జీవించాడని చెప్పవచ్చు. రొటీన్‌కు భిన్నంగా అద్భుతమైన క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారారు.
మిగితా పాత్రల్లో దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో దయానంద్ రెడ్డి గుర్తుండిపోతారు.
Rx100 movie Review & Rating
Rx100 movie Review & Rating
సంగీతం :-
ఆర్ఎక్స్ 100 చిత్రానికి ప్రాణం సంగీతం. చైతన్ భరద్వాజ్ అందించిన పాటలు సిట్యువేషనల్‌గా బాగున్నాయి. రీరీకార్డింగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. సెకండాఫ్‌లో సినిమాకు రీరికార్డింగ్ ప్రాణంగా నిలిచింది.
కూర్పు : –
ఎడిటర్ ప్రవీణ్ పనీతరు చాలా క్రిస్పీగా ఉంది. సెకండాఫ్ ఆయన టాలెంట్‌కు నిదర్శనమని చెప్పవచ్చు. తొలిభాగంలో అక్కడక్కడ కొన్ని కత్తెర్లు పడటానికి స్కోప్ ఉంది.
సినిమాటోగ్రఫీ : –
రామిరెడ్డి అందించిన సినిమాటోగ్రఫి సూపర్ అని చెప్పవచ్చు. ఏరియల్ షాట్స్, ఛేజింగ్ సీన్లు ఆకట్టుకునేలా ఉంటాయి. రొమాంటిక్ సీన్ల చిత్రీకరణ, అలాగే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు నడిచే సన్నివేశాల మూడ్‌, ఎమోషన్‌ను ఎలివేట్ చేయడానికి క్రియేట్ చేసిన వాతావరణం బాగుంది.
నిర్మాణవిలువలు : –
కార్తీకేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందించిన ఆర్ ఎక్స్ 100 చిత్రానికి నిర్మాతగా అశోక్ రెడ్డి గుమ్మకొండ వ్యవహరించారు. సినిమాను రిచ్‌గా తెరకెక్కించిన విధానం బాగుంది. టెక్నికల్ విభాగాలకు సంబంధించిన నిపుణుల ఎంపిక, నటీనటుల సెలక్షన్ నిర్మాణ విలువలకు అద్దం పట్టింది. కొత్త బ్యానర్ అయిపన్పటికీ అనుభవం ఉన్న ప్రొడక్షన్ సంస్థ రూపొందించిన చిత్రంగా అనిపిస్తుంది. చిత్రాన్ని ప్రమోట్ చేసిన తీరు చాలా ప్రొఫెషనల్‌గా ఉంది.
కొసమెరుపు : –
 ఫైనల్‌గా ఆర్ఎక్స్ 100 రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్. యూత్‌ను టార్గెట్‌గా చేసుకొని తీసినట్టు అనిపించినా చిత్ర రెండో భాగంలో ఉండే భావోద్వేగా అంశాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టచ్ చేసేలా ఉంది. తొలిభాగంలో స్లో నేరేషన్ అనిపించినప్పటికీ కథకు లోబడి మాత్రమే సినిమా ముందుకెళ్తుంది. పక్కాగా నేటివిటి చిత్రంగా రూపొందిన ఈ చిత్రం బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను సంతృప్తి పరిచే అంశాలు ఎక్కువగానే కనిపిస్తాయి. ఓవర్సీస్, మల్టీప్లెక్స్ ఆడియెన్స్ చేరువైతే సక్సెస్‌లో ఈ సినిమా మరో స్థాయికి చేరుకొనే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here