తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదు అన్న మంత్రి

26
Galla Aruna condemns rumours of joining YCP

మాజీ మంత్రి టీడీపీ నేత గల్లా అరుణకుమారి తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని, ఎట్టిపరిస్థి తుల్లోనూ వైసీపీలో చేరబోనని ప్రకటించారు. గత కొంతకాలంగా పార్టీ పట్ల కినుక వహించిన ఆమె మౌనం వీడి మీడియాతో మాట్లాడారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు కాంగ్రెస్‌ తరపున గెలిచిన ఆమె….గత ఎన్నికల సమయంలో, విధిలేని పరిస్థితుల్లో టిడిపిలో చేరారు. 2014 లో వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిపై పోటీచేసి ఓటమిపాలయ్యారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనే రాజకీయ రంగప్రవేశం చేసిన ఆమె తనయుడు గల్లా జయదేవ్‌ గుంటూరు నుంచి లోక్‌సభకు టిడిపి తరపున ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచి చంద్రబాబు తనయుడు లోకేష్‌ పోటీ చేస్తారని, అరుణ కుమారిని పలమనేరుకు వెళ్లమని చెప్పినట్లు వార్తలొచ్చాయి. చంద్రగిరి నుంచి ఆరు పర్యాయాలు పోటీ చేసి నాలుగు సార్లు గెలుపుపొందిన ఆమెకు ఇక్కడ బలమైన అనుచర గణం ఉంది. కులాలతో సంబంధం లేకుండా ఊరూరా ఆమె మద్దతుదారులున్నారు. ఆమె ఎటువెళితే అటు గుడ్డిగా వెళ్లేంతగా అభిమానించే కార్యకర్తలున్నారు. ఇలాంటి నియోజకవర్గాన్ని వదులుకుని పలమనేరుకు వెళ్లడం ఇబ్బందే.

Galla Aruna condemns rumours of joining YCP

గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ఆమె కాస్త నిరాశ చెందారు. అయినా ఎంఎల్‌సిగానైనా ఎన్నికై, మంత్రి పదవి చేపట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఎంఎల్‌సి ఎన్నికల్లో ఇతరులకు సీట్లు ఇచ్చారుగానీ అరుణకు ఇవ్వలేదు. ఇటీవల గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు ఎంఎల్‌సిగా ఉంటూ అనారోగ్యంతో మరణించారు. ఆ స్ధానాన్ని తనకి ఇవ్వాలని ప్రయత్నాలు చేసినప్పటికీ, గాలి కుటుంబంలోని ఒకరికి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 2019 ఎన్నికల్లో అటు చంద్రగిరి ఎంఎల్‌ఏ టికెట్టు ఇవ్వకుండా, ఇటు ఎంఎల్‌సి పదవి ఇవ్వకుండా…ఎక్కడికో పలమనేరుకు వెళ్లడ ఏమిటి…? అనేది గల్లా అరుణ ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ఆమె అలకబూని, తనను చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతల నుంచి కూడా తప్పించమని ముఖ్యమంత్రిని కోరారు. ఆ తరువాత విదేశాలకు వెళ్ళిపోయారు. పార్టీ పట్ల కినుక వహించడం వల్లే ఆమె విదేశాలకు వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఆమె అనుచరులు గల్లా అరుణకుమారి నాయకత్వమే చంద్రగిరి నియోజకవర్గానికి అవసరమని సమావేశాలు నిర్వహించి ప్రకటించారు. మరోవైపు అరుణకుమారి తనయుడు గల్లా జయదేవ్ ఎంపీగా టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ ఆమెను ఎలా సముదాయించాలో గాని వారం రోజుల క్రితం విదేశాలను చూసిన ఆమె చాలాకాలం తర్వాత మీడియాతో మాట్లాడారు. టిడిపిని వీడేది లేదని ప్రకటించారు. చంద్రగిరి ఇన్చార్జిగా తననే కొనసాగాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారని వెల్లడించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే 2019 ఎన్నికల్లో చంద్రగిరి టిడిపి అభ్యర్ధి గల్లా అరుణకుమారేనని స్పష్టమవుతోంది. ఈమేరకు పార్టీ అధినేత భరోసా ఇవ్వడం వల్లే గల్లా అరుణకుమారి అలక వీడి క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారని పరిశీలకులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here