పాదయాత్రలో జగన్ ఫై తేనెటీగల దాడి…

30

పశ్చిమ గోదావరి జిల్లాలోని కానూరు క్రాస్ రోడ్డు వద్ద జరుగుతున్న పాదయాత్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తేనెటీగలు దాడి చేశాయి. జగన్ పాదయాత్ర చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు చుట్టుముట్టడంతో ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న దాదాపు పదిమందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వెంటనే చికిత్స అందించాలని జగన్ చెప్పారు. తెనెటీగలు ఒక్కసారిగా రావడంతో జగన్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైసీపీ అధినేతకు తేనెటీగలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశారు.

Honey Bees Attack On YS Jagan at Padayatra in Nidadavolu

తమ చేతిలో ఉన్న టవల్స్ లేదా కండువాలతో జగన్ చుట్టూ చేరి తేనెటీగలు ఆయన వద్దకు రాకుండా ప్రయత్నాలు చేశారు. భద్రతా సిబ్బందితో పాటు కొందరు కార్యకర్తలు కూడా జగన్ వద్దకు తేనెటీగలు రాకుండా చేసే ప్రయత్నంలో భాగంగా కండువాలతో అదేపనిగా దులిపారు. కాగా, జగన్ పాదయాత్ర గురువారానికి 183వ రోజుకు చేరుకుంది. ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కానూరు క్రాస్ రోడ్డుకు చేరుకున్నారు. అక్కడ ఈ సంఘటన చోటు చేసుకుంది. జగన్ ఇప్పటి వరకు 2,268 కిలోమీటర్లు నడిచారు. ఆయన వర్షాన్ని కూడా లెక్కచేయకుండా నడుస్తున్నారు. ఇప్పుడు తేనేటీగలు దాడి చేసినా పాదయాత్ర ఆపలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here